రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికల నిర్వహణ అంటే, అధికార పార్టీకి కత్తి మీద సాము లాంటిదేనని తేలిపోయింది. వైసీపీ కింది స్థాయి నేతల నుంచి, ముఖ్యమంత్రి వరకు.. ప్రతి ఒక్కరూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు చెబితే ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘నిమ్మగడ్డకు మనమే అనవసర ప్రాధాన్యమిస్తున్నామేమో..’ అని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నా, ఆ ‘ప్రాధాన్యత’ ఆయనకు ఇవ్వక తప్పడంలేదు వైసీపీ అధిష్టానానికి. ప్రభుత్వాన్ని సైతం పణంగా పెట్టి నిమ్మగడ్డతో ఢీ కొనేందుకు వైసీపీ యత్నిస్తోందన్న విమర్శలున్నాయి. సరే, ఈ విషయంలో ఎవరి వాదనలు వారివి. అసలు విషయానికొస్తే, పంచాయితీ ఎన్నికలతోనే నిమ్మగడ్డ, అధికార పార్టీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటిది, మరో స్థానిక సమరం అతి త్వరలో.. అదీ నిమ్మగడ్డ హయాంలో.. అంటే ఇంకేమన్నా వుందా.? గత మార్చిలో అర్థాంతరంగా ఆగిపోయిన స్థానిక ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే, ఆ స్థానిక ఎన్నికల పక్రియను పునఃప్రారంభించేందుకు నిమ్మగడ్డ తెరవెనుక ప్లానింగ్స్ పూర్తి చేసేశారట.
మరోపక్క, మార్చి 31వ తేదీతో నిమ్మగడ్డ పదవీ కాలం ముగియాల్సి వుండగా, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన ఆర్డినెన్స్, ఈ క్రమంలో తన తొలగింపు.. తద్వారా కోల్పోయిన పదవీ కాలాన్ని, తిరిగి పొందే క్రమంలో ఇంకో మూడు నెలలపాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకోవాలనే ఆలోచనతో వున్నారట నిమ్మగడ్డ. అది సాధ్యమయ్యే పనేనా.? అన్నది వేరే చర్చ. కానీ, ఈ వ్యవహారంపై అధికార పార్టీలో కూడా గుబులు బయల్దేరిందని అంటున్నారు. నిమ్మగడ్డ తదుపరి వ్యూహమేంటన్నదానిపై ఆరా తీస్తున్న అధికార పార్టీ, నిమ్మగడ్డ తన పదీ కాలాన్ని పెంచుకునేందుకు వేస్తున్న ఎత్తుగడల్ని చిత్తు చేయడానికి ప్రతి వ్యూహాన్ని రచించడంలో నిమగ్నమయ్యిందట. మరి, వైసీపీ ప్రతివ్యూహం ఫలిస్తుందా.? నిమ్మగడ్డకి అసలు పొడిగిపు అవకాశం వుందా.? వేచి చూడాల్సిందే.