అమరావతి పేరుతో చంద్ర బాబు అప్పులు చేసినా..
వైజాగ్ రాజధాని పేరుతో జగన్ అప్పులు తెచ్చినా
రాష్ట్ర ప్రజలంతా చెల్లించాలి అప్పులు.. తప్పవు తిప్పలు…
రాజుగారే తలుచుకుంటే దెబ్బలకు కొదవా!!
కానీ వైజాగ్ రాజధాని పేరుతో వైజాగ్ – భోగాపురం (విజయనగరం) మధ్యలో వందల వేల కోట్లు పెట్టాలని గట్టిగా పట్టుబడుతున్నారు జగను. ఆ ఏరియా భూముల రేట్లు పెంచాడు పదింతలు.. ప్చ్!! కేవలం వైజాగ్ బీచ్ కే 2000 కోట్లు ప్రకటించాడు మొన్న .. టెండర్లు బిడ్లు వేశారు. వరుసగా 20 ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లు టెండర్లు అంటూ ఒకటే హడావుడి జరుగుతోంది. ఆ మేరకు జీవీఎంసీ వరుస నోటిఫికేషన్లు హీట్ పెంచేస్తున్నాయి. పెందుర్తి- భోగాపురం 6లైన్స్ రోడ్స్ వెంబడి రాజధాని నిర్మాణం ప్రణాళికలు వేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నాడు. ఈచోట వందల కోట్లు పెట్టాలని ఉబలాటపడుతున్నారు. కాపులుప్పాడలో పాలనా రాజధాని చేస్తారట. 150 కిలోమీటర్లు మెట్రోకి భారీ ప్రణాళికలు రచించారు. భీమిలి నుంచి విజయనగరం భోగాపురం వరకూ మహర్ధశ పట్టిస్తారట. ఇప్పటికే రోడ్ల కోసం రవాణా కోసం భారీగా టెండర్లు పిలిచారు. డబ్బు వెదజల్లే ప్రణాళికల్ని రచించారు.
అమరావతి పెట్టుబడుల్లో చాలావరకూ ఇటు మళ్లించడం ఉత్తరాంధ్రకు కచ్ఛితంగా మేలే.. ఇది కాదనలేని నిజం. కాకినాడ నుంచి వైజాగ్ వరకూ బీచ్ లు.. వైజాగ్ నుంచి విజయనగరం.. శ్రీకాకుళం వరకూ బీచ్ లన్నీ హార్బర్లు పోర్టులు ప్లాన్ ఉంది. బీచ్ వెంబడే ట్రామ్ ట్రెయిన్ (విదేశాల్లో ఉంది) ట్రాక్ వేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. బీచ్ పర్యాటకం అంటూ చంద్రబాబు కాలంలోనే ఊదరగొడితే.. ఇన్నాళ్లకు జగనూ దానిపై మరోమారు ఆలోచిస్తున్నారు. బీచ్ సాగర తీరాల్లో ఫిషింగ్ కోసం హార్బర్లు కడతామని ప్రకటించారు. మరోవైపు గోవా బీచ్ ల తరహాలో వరుసగా బీచ్ లన్నీ డెవలప్ చేసేందుకు పెట్టుబడుల్ని ఆహ్వానిస్తారట.
నిజాయితీగా చేస్తే ఉత్తరాంధ్రకు ప్రతిఫలాలు అందొచ్చు.. పాలకులు నాటకాలాడితేనే అంతా శూన్యం! అటు రాయలసీమకు చేస్తున్నాడు కొన్ని.. ఇటు ఉత్తరాంధ్రకు చేస్తున్నాడు మరి కొన్ని. అమరావతి – బెజవాడకు చేసినా ఇక ఓట్లు రాలవు.. అందుకని కాస్త నెమ్మదిస్తుంది అక్కడ అభివృద్ధి.. కానీ మూడు చోట్లా అభివృద్ధి చేయడం పాలకులు చేయాల్సినది. కానీ ఎక్కడ ఓటు బ్యాంకు పోగుపడితే అక్కడ అభివృద్ధి మంత్రం జపిస్తే ఏం కావాలి?
ఏదో ఒకచోట చేస్తే మరో హైదరాబాద్ సైబరాబాద్ అవుతుంది .. మూడు చోట్లా చేస్తే వికేంద్రీకరణ అవుతుంది.. ఇదైనా సరిగ్గా జరుగుతుందా? చూద్దాం.. జరగాలనే ఆశిద్దాం. తేదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కోసం అప్పులు తెచ్చారు. అభివృద్ధి చేశారు. దాంతో ఉద్యోగాలు ఉపాధి పెరిగింది. తెలంగాణను ఓ కాపు కాసిన సిటీ ఇది. ఇప్పటికీ ఇదో భరోసా అయ్యింది. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తే మరోసారి అదే రిపీట్ అయ్యేది. అలా కాకుండా ఏపీలో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి కావాలని వికేంద్రీకరణ అంటున్నారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.
అటు కరువుతో కొట్టుమిట్టాడే రాయలసీమకు కచ్ఛితంగా అభివృద్ధి అవసరం. రోడ్లు రవాణా పరిశ్రమలు అన్నీ కావాలి ఇక్కడ కూడా. ఇటు దశాబ్ధాల పాటు వెనకబడ్డ ఉత్తరాంధ్రకు అభివృద్ధి కావాలి. ఇక్కడ ఉన్న పుష్కలమైన వనరుల్ని వినియోగించి అభివృద్ధికి బాటలు వేయాలి. అలాగని అమరావతి- గుంటూరు బెల్టును వదిలేస్తే ఎలా? ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా సమ అభివృద్ధి ప్రాతిపదికన బాటలు వేయాలి. ఇక అమరావతి – విజయవాడ- గుంటూరు అభివృద్ధి చెందిన పట్టణాలు కాబట్టి ఆ చుట్టు పక్కల గ్రామాల్లో సైతం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పనులు చేపట్టాలి. ఇదంతా నిజాయితీగా జరుగు తుందా? వికేంద్రీకరణ అన్నది గొప్ప అంశం. కానీ నాయకులు దానిని నిజాయితీగా అమలు చేస్తారా? అన్నదే జవాబు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. పాలకుల్లో జవాబుదారీతనం ఏదీ? 2.5 లక్షల కోట్ల అప్పుల్ని ప్రజల నెత్తిన పెట్టిన చంద్రబాబు సాక్షిగా.. 5 లక్షల కోట్ల అప్పుల కోసం పాకులాడుతున్న జగన్ సాక్షిగా.. మునుముందు అసలేం జరగబోతోంది?