గతకొంత కాలంగా సామాన్యుల్లో బలంగా జరుగుతున్న చర్చ రూ.2000 నోట్ల గురించి. ఏటిఎం లలో కనిపించడం లేదు.. బ్యాంకుల్లో కూడా పెద్దగా దర్శనమివ్వడం లేదు.. మరి ఈ నోట్లన్నీ ఏమైనట్లు. సుమారు 12 లక్షల కోట్ల విలువైన ఈ రెండువేల నోట్లు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి అంటూ తెగ చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రమంత్రి నిర్మళా సీతారామన్ వివరణ ఇచ్చారు. 2000 రూపాయల నోట్లు ఏటీఎం లలో పెట్టడం, పెట్టకపోవడం బ్యాంకుల ఇష్టమని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి నిబందనలు లేవని తెలిపారు. అయితే… ఇవన్నీ “పెద్దల” వద్ద ఉన్నాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును… ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అప్పటికప్పుడంటే ఇబ్బందైపోద్దని భావించిన కొందరు బడా నేతలు… ఇప్పటినుంచే వాటికి చిల్లర అడిగడం స్టార్ట్ చేశారని కథనాలొస్తున్నాయి. అందులో భాగంగా… ఎన్నికల్లో పంచేందుకు వీలుగా రూ.2 వేల నోట్లకు చిల్లరగా రూ.500 నోట్లు కావాలని అడుగుతున్నారట. తాము దాచుకున్న రూ.2 వేల నోట్లను చిల్లరగా మార్చే పనిని కొన్ని గ్యాంగులకు అప్పగించారట “పెద్దలు”. ఈ గ్యాంగులు కొద్ది రోజులుగా ఖమ్మం, వరంగల్ నగరాల్లో తిరుగుతున్నాయని కథనాలొస్తున్నాయి.
“మేం రూ.2 వేల నోట్ల కట్టలు ఇస్తం. వాటికి సరిపడా రూ.500 నోట్ల కట్టలు మాకు ఇవ్వండి. ఇందుకు కోటికి రూ.లక్ష కమీషన్ ఇస్తం” అనే ఆఫర్లు ప్రస్తుతం తెలంగాణలో బలంగా నడుస్తున్నాయని అంటున్నారు. అవును… “మేం మారుస్తున్న నోట్లన్నీ రాజకీయ నాయకులు దాచిపెట్టిన మనీ.. ఇవి ఫేక్ నోట్లు అనే అనుమానం అక్కర్లేదు.. డౌట్ ఉంటే మీ దగ్గర ఉన్న కౌంటింగ్ మెషిన్లు తెచ్చి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాతే రూ.500 నోట్లు ఇవ్వండి. కోటికి లక్ష కట్ చేసుకొని రూ.99 లక్షలు ఇస్తే సరిపోతుంది” అనేది వారి సింగిల్ పాయింట్ బిజినెస్ ఎజెండా అంట!
ఈ గ్యాంగులు ముఖ్యంగా… బ్యాంకు ఉద్యోగులు, చిట్ ఫండ్ కంపెనీల ఓనర్లు, రియల్టర్లను కలుస్తున్నాయట. వాళ్ల దగ్గర అయితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయని వాళ్లను సంప్రదిస్తున్నాయట. ఇలా భారీ మొత్తంలో మార్చేందుకు ముందుకొస్తున్న వారిని సంబంధిత రాజకీయ నాయకులతోనూ మాట్లాడించి నమ్మకం కుదురుస్తున్నారని తెలుస్తోంది!
కాగా… 2016 నవంబర్ లో కేంద్రం పాత నోట్ల రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.2 వేల నోట్లను తెచ్చింది. దాదాపు ఏడాది పాటు అందరి దగ్గర కనిపించిన రూ.2 వేల నోట్లు.. తర్వాత మార్కెట్ నుంచి మాయమయ్యాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో, ఏటీఎం సెంటర్లలో కూడా రూ.2 వేల నోట్లు పెద్దగా కనిపించకపోవడం తెలిసిందే!