రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు కీలకమైన ఊరట కలిగించే నిర్ణయాన్ని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటరు జాబితాలో తమ పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేదో మరోసారి పరిశీలించుకునేందుకు వీలుగా స్పెషల్ ఓటర్ సవరణ గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, రాజకీయ పార్టీల సూచనల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ పొడిగించిన గడువు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పుడు డిసెంబర్ 11 వరకు ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ గడువు ముగిసిన తరువాత డిసెంబర్ 16న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
అంతేకాదు, ఓటర్ జాబితాలో నమోదు, తొలగింపు, సవరణలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించే బాధ్యతను ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లకు అప్పగించారు. ఈ ప్రక్రియను ఫిబ్రవరి 7, 2026 నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటరు జాబితా పూర్తిగా ఖచ్చితంగా, పారదర్శకంగా ఉండేలా ఈసారి మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ఎన్నికల సంఘం సంకేతాలు ఇచ్చింది.
ఈ పరిణామాల మధ్యే ఎన్నికల సంఘం మరో కీలక అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నవంబర్ 28న తృణమూల్ కాంగ్రెస్ (AITC) ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) వేతనాల అంశాన్ని గట్టిగా లేవనెత్తింది. క్షేత్ర స్థాయిలో ఓటరు జాబితా తయారీకి వెన్నెముకలుగా పనిచేసే ప్రభుత్వం చెల్లించాల్సిన గౌరవ వేతనాలు ఇంకా పెండింగ్‌లో ఉండటంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈసీ ఆమోదం ప్రకారం సంవత్సరానికి రూ.12,000 గౌరవ వేతనం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం అదనంగా రూ.6,000 చెల్లించాల్సి ఉండగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ మొత్తాన్ని విడుదల చేయకపోవడాన్ని “అంగీకరించలేని నిర్లక్ష్యం”గా ఈసీ పేర్కొంది. ఈ బకాయిలను ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే చెల్లించాలని రాష్ట్రాలకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.
ఓటరు జాబితా అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది లాంటిదని, అందులో చిన్న తప్పిదం కూడా ఎన్నికల విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని ఎన్నికల సంఘం గుర్తు చేసింది. అలాంటి కీలక బాధ్యత నిర్వర్తిస్తున్న బూత్ లెవెల్ సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం తీవ్రంగా ఖండనీయం అని ఈసీ అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా, ఓటరు జాబితా సవరణకు లభించిన ఈ అదనపు సమయాన్ని ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా యువత, కొత్త ఓటర్లు, చిరునామాలు మారిన వారు, మరణించిన వారి పేర్ల తొలగింపుకు దరఖాస్తు చేసుకునే వారు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది.
