‘వైసీపీ కార్యకర్తలకే 90 శాతానికి పైగా అవకాశాలు కల్పించాం..’ అంటూ వాలంటీర్ల విషయమై గతంలో వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు, వైసీపీ హయాంలో వాలంటీర్లు.. ఈ రెండిటి మధ్యా పెద్దగా తేడాల్లేవని వైసీపీ, టీడీపీయేతర రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న విషయం విదితమే. అయితే, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళి సంక్షేమ పథకాలకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెడుతుండడాన్ని అభినందించి తీరాల్సిందే. కాలు కదపలేని పరిస్థితుల్లో వున్న వృద్ధులకు వాలంటీర్ల కారణంగా పెన్షన్లు సకాలంలో అందుతున్నాయి. ఈ విషయంలో వాలంటీర్ వ్యవస్థ పనితీరుకి సలాం కొట్టి తీరాల్సిందే.
అయితే, ఆ వాలంటీర్లకు నెలకు 5 వేల రూపాయల జీతం ఇస్తోన్న జగన్ సర్కార్, కొత్తగా డోర్ టు డోర్ రేషన్ డెలివరీ వాహనాల డ్రైవర్ల విషయంలో మాత్రం ప్రత్యేకమైన ప్రేమ ప్రదర్శిస్తోంది. చిన్న గీత పక్కన పెద్ద గీత పెడితే.. పరిస్థితిలో ఎంత మార్పు వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డోర్ టు డోర్ రేషన్ డెలివరీ వాహన డ్రైవర్లు, నెల రోజుల్లోనే ప్రభుత్వంపై ఒత్తడి తీసుకొచ్చి, తమ వేతనాల్ని పెంచుకోగలిగారు. ఈ విషయం వాలంటీర్లకు ఎక్కడో కాలేలా చేసింది. అంతే, జగన్ సర్కార్ మీద నిరసనల యుద్ధమే ప్రకటించేశారు. పంచాయితీ ఎన్నికల వేళ వాలంటీర్ల ఓట్లు, వారి సేవలు అధికార పార్టీకి అత్యవసరం. పార్టీ రహిత ఎన్నికలే అయినా, వాలంటీర్లపై వైసీపీ చాలా ఆశలే పెట్టుకుంది. వాలంటీర్లు తమ వేతనాల కోసం డిమాండ్ చేస్తున్నారు. కానీ, వారు డిమాండ్ చేసిన స్థాయిలో వేతనాలు పెంచడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. రేషన్ డోర్ డెలివరీ వాహనాల డ్రైవర్లంటే 10 వేల లోపే వున్నారు. వాలంటీర్లు అలా కాదు కదా. లక్షల్లో వున్నారు. వారందరికీ వేతనాలు పంచడమంటే, అదో తలనొప్పి వ్యవహారంగా మారిపోతుంది. రెండు వేలో, మూడు వేలో పెంచితే సరిపోదు కూడా. కనీసం 5 వేలు పెంచాలన్నది వాలంటీర్ల డిమాండ్‌గా కనిపిస్తోంది. తన వేలితో తన కంట్లోనే పొడుచుకునే పరిస్థితిని వైఎస్ జగన్ సర్కార్ కొనితెచ్చుకున్నట్లే వుందన్నది వాలంటీర్ల ఆందోళనపై రాజకీయ విమర్శకులు చేస్తోన్న కామెంట్.