ప్రత్యేక హోదా అటకెక్కింది.. అమరావతి అధోగతిపాలయ్యింది.. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాబోతోంది. ఎందుకిలా.? అసలు 13 జిల్లాల ఆంధ్రపదేశ్‌కి ఏమయ్యింది.? రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే రాష్ట్రానికి ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయా.? అంటే, ఔననీ చెప్పలేం.. కాదనీ చెప్పలేం. దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయాలు ఇలాగే వున్నాయి. కానీ, అక్కడెక్కడా లేని దురదృష్టకర పరిస్థితులు ఆంధ్రపదేశ్‌లో కనిపిస్తున్నాయి. లేకపోతే, ఒకదాన్ని మించి.. ఇంకోటి రాష్ట్రానికి నష్టం చేసే కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయి.? విశాఖపట్నం అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖని ఉక్కునగరంగా అభివర్ణించేది ఉక్కు కర్మాగారం కారణంగానే.
ఆ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరిగితే, అది విశాఖకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ప్రభుత్వ ఆసుపత్రికీ, ప్రైవేటు ఆసుపత్రికీ ఎంత తేడా.? ప్రభుత్వ బస్సుకీ, ప్రైవేటు బస్సుకీ ఎంత తేడా.? ప్రభుత్వ నిర్వహణలో వున్న కర్మాగారానీకీ.. ప్రైవేటు నిర్వహణతో నడిచే కర్మాగారానికీ అంతే తేడా.. అన్నది ఓ వాదన. ఆ సంగతి పక్కన పెడితే, కార్మికుల ప్రయోజనాలు, ఉద్యోగావకాశాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులొచ్చేస్తాయి ప్రైవేటీకరణ కారణంగా. ప్రభుత్వ సంస్థకి నష్టాలొస్తే.. ప్రభుత్వం ఆదుకుంటుంది, లేదంటే అమ్మేస్తుందేమో. అదే ప్రైవేటుకి నష్టమొస్తే.. రాత్రికి రాత్రి మూసేస్తారు. అలాంటి పరిస్థితి విశాఖ ఉక్కుకి భవిష్యత్తులో రాదన్న గ్యారంటీ ఏంటి.? అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. టీడీపీ – వైసీపీ మధ్య రాజకీయ పోరు కారణంగా, కేంద్రంపై ఎవరూ గట్టిగా మాట్లాడటంలేదన్న వాదనల్లో కొంత వాస్తవం లేకపోలేదు. అంతమాత్రాన ఆ గొడవల కారణంగానే బీజేపీ, రాష్ట్రానికి అన్యాయం చేయగలుగుతోందనీ అనలేం. కానీ, కేంద్రాన్ని ఈ విషయంలో ప్రశ్నించాల్సిందే. దీనికి అధికార వైసీపీనే పెద్దన్న తరహాలో బాధ్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలనూ కలుపుకుపోయి, కేంద్రాన్ని ఈ విషయంలో నిలదీయగలగాలి. కానీ, ఆ ఐక్యత మన రాష్ట్రంలో కనిపిస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.