అడిలైడ్ ఓవల్ మరోసారి విరాట్ కోహ్లీకి నిరాశనే అందించింది. మైదానంలో అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రేక్షకులు “కింగ్ కోహ్లీ.. కింగ్ కోహ్లీ” అంటూ హోరెత్తించారు. కానీ, అతి తక్కువ సమయంలో ఆ కేకలు మౌనంగా మారిపోయాయి. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని, మరోసారి డకౌట్ అయిన కోహ్లీ ముఖంలో మాత్రం కోపం కనిపించలేదు. బదులుగా, ఆ చిరునవ్వు కనిపించింది.
ఇది కోహ్లీకి ఇది వరుసగా రెండో డకౌట్. పెర్త్ వన్డేలో ఎనిమిది బంతులు ఆడిన అతడు ఖాతా తెరవకముందే అవుట్ అయ్యాడు. ఇప్పుడు అడిలైడ్‌లోనూ అదే కథ పునరావృతమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడు నెలల విరామం తర్వాత తిరిగి వచ్చిన కోహ్లీ, ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రన్ లేకుండానే మైదానం వదిలిపెట్టడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
అవుట్ అయిన తరువాత కోహ్లీ నెమ్మదిగా పెవిలియన్ వైపు నడిచాడు. ప్రేక్షకులను ఒక్కసారి చూసి చిరునవ్వు చిందించాడు. ఆ క్షణం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చివరి సారి అయి ఉంటుందా.. కోహ్లీ వన్డేలకు గుడ్‌బై చెప్పబోతున్నాడా.. అంటూ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఆయన చిరునవ్వు వెనుక ఒక నిశ్శబ్ద సందేశం ఉన్నట్టుగా అనిపించిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.
కోహ్లీ కెరీర్‌లో ఇది మొదటిసారి వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం. కింగ్ కోహ్లీకి ఇది సాధారణం కాదు. ఎందుకంటే అతను ఎప్పుడూ పెద్ద మ్యాచ్‌ల్లో, క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు అండగా ఉండే ఆటగాడు.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆయన గణాంకాలు చూస్తే.. 46 సెంటరీలు, 70 సగటు.. ఇవే ఆయన స్థాయిని చూపిస్తాయి. కానీ ఇప్పుడు రెండు మ్యాచ్‌ల్లోనూ రన్ లేకుండా వెనుదిరగడం అభిమానులకు అసహనాన్ని కలిగించింది.
అడిలైడ్ అనే ఈ వేదిక కోహ్లీకి ఎప్పుడూ ప్రత్యేకం. గతంలో ఇక్కడే ఆయన అద్భుత శతకాలు సాధించాడు. టెస్ట్‌లు, వన్డేలు, టీ20లు కలిపి అడిలైడ్‌లో కోహ్లీ 967 పరుగులు సాధించాడు. ఇంకొన్ని 25 పరుగులు చేస్తే వెయ్యి పరుగుల మార్క్ చేరుకునేవాడు. కానీ, అదృష్టం ఆయన వైపు లేకపోవడంతో ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు.
క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోహ్లీ ప్రస్తుతం తాత్కాలికంగా ఫార్మ్ లో లేడు. కానీ ఇలాంటి ఫేజ్‌లు అతని కెరీర్‌లో ఇప్పటికే వచ్చినవే. పెద్ద మైదానాల్లో తిరిగి లేచే సత్తా కోహ్లీకి ఉంది అంటున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో అయితే పరిస్థితి భిన్నంగా ఉంది. కొంతమంది అభిమానులు కోహ్లీని నిలదీయగా, మరికొందరు కింగ్ మోడ్‌లో తిరిగి వస్తాడు అంటూ మద్దతు వ్యక్తం చేస్తున్నారు.
