వినాయకుడు కలలో కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

త్వరలోనే వినాయక చవితి రానుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ, పూజలు, ఉత్సవాలతో ప్రతి చోటా భక్తి వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో వినాయకుని కలలో దర్శనం ఇస్తే.. దీని అర్థం ఏంటో తెలుసా. ఈ కథనంలో స్వప్న శాస్త్రం ఏం చెబుతోందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మనకు నిద్రలో వచ్చే కలలు కొన్నిసార్లు మరచిపోతాం, కొన్నిసార్లు మర్చిపోలేం. కానీ కొన్ని కలలు మన మనసులో ఆలోచనలు రేకెత్తిస్తాయి. ముఖ్యంగా, కలలో దేవత దర్శనం అయితే దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందులోనూ గణపతి దర్శనం అయితే… ఆ కల వెనక ఉన్న సందేశం పాజిటివ్‌గానే ఉంటుంది అంటున్నారు పండితులు.

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు గణపతి. కలలో కనిపించడం అంటే, మన జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగి శుభాలు కలుగుతాయని భావించాలంట.. మన దేశంలో ఏ శుభకార్యం మొదలెట్టినా ముందుగా వినాయకునికి పూజలు చేస్తారు. కారణం ఏ విఘ్నం లేకుండా కార్యం విజయవంతం కావాలని. అదే విధంగా కలలో బొజ్జగణపయ్య దర్శనం కూడా విజయానికి సంకేతమని నమ్మకం.

గణేశుడు శుభానికి, మంచితనానికి ప్రతిరూపం. ఆయన కలలో కనిపిస్తే, మీపై స్వామి ఆశీస్సులు ఉన్నట్లు. కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆరంభాలు చేయడానికి ఇది మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, మీరు చేయాలని అనుకున్న మంచి పని వాయిదా పడ్డా, గణపతి కలలో కనిపించడం ద్వారా దాన్ని గుర్తుచేస్తాడని విశ్వాసం. అదే విధంగా, మీరు ఎవరికి ఇచ్చిన మంచి మాటను మర్చిపోతే, స్వామి కలలో దర్శనం ఇచ్చి ఆ బాధ్యతను గుర్తు చేస్తాడని అంటారు.

అయితే, గణపతిని కలలో బలవంతంగా రప్పించుకోవాలని ప్రయత్నించడం అవసరం లేదు. కలలు మన ఆలోచనలు, మన పరిస్థితులు, మన పరిసరాలను ప్రతిబింబిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అవి సహజంగా వచ్చినప్పుడే అవి నిజం అవుతాయని చెబుతున్నారు.