ఆమెకు ఎప్పుడు ఆవేశం వస్తుందో తెలియదు.. ఆవేశం వచ్చిందంటే చాలు, రాజకీయంగా తెగ ఆయాసపడిపోతారామె. పరిచయం అక్కర్లేని పేరది. ఆమె ఎవరో కాదు, రాములమ్మ అలియాస్ విజయశాంతి. సినీ నటిగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజకీయ తెరపై మాత్రం అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు. బీజేపీ నుంచి బయటకొచ్చి, తల్లి తెలంగాణ పార్టీ.. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి, నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీ. జర్నీ చాలా పెద్దదే. ఇంత జర్నీలో ఆమె ఒకే ఒక్కసారి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచి, నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారు.? అని మాత్రం అడక్కూడదు.. అదంతే.!
కేసీఆర్‌కి దేవుడిచ్చిన చెల్లెలు..
విజయశాంతిని కేఈఆర్, తనకు దేవుడిచ్చిన చెల్లెలిగా భావించారు. విజయశాంతి కూడా, తనకు దేవుడిచ్చిన అన్న కేసీఆర్.. అని చెప్పుకున్నారు. ఈ తరహా రాజకీయ బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. టీఆర్‌ఎస్ నుంచి విజయశాంతిని కేసీఆర్ బయటకు పంపేశారు. ఆ తర్వాత ఆమె, కాంగ్రెస్ పంచన చేరారు. కొద్ది రోజులు టీఆర్‌ఎస్ వెంటే ఆమె వుండి వుంటే, ఇప్పుడామె తెలంగాణలో మంత్రి పదవిలో వుండేవారేమో.! టైమ్ బ్యాడ్.. ఆమెను అలా రాజకీయంగా వెనక్కి నెట్టేసింది కాలం.!
అద్వానీ శిష్యురాలు ఈ రాజకీయ రాములమ్మ..
ఒకప్పుడు విజయశాంతి అంటే.. అద్వానీ శిష్యురాలనేవారు అంతా. బీజేపీ అధిష్టానంతో అప్పట్లో ఆమెకు సన్నిహిత సంబంధాలుండేవి. తెలుగు నాట మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో విజయశాంతి చక్రం తిప్పేస్తారని అంతా భావించారు. కానీ, రాజకీయాల్లో వేసిన తప్పటడుగుల కారణంగా, ఆమె కీలక పదవులకు దూరమయ్యారు.. దూరమవుతూనే వున్నారు. కాంగ్రెస్‌లో చేరి, అక్కడా ఆమె కొన్ని పదవులైతే దక్కించుకున్నారుగానీ.. చీటికీ మాటికి అలకపాన్పు ఎక్కేసి.. వున్న ఇమేజ్‌ని పాడుచేసుకున్నారాయె.
సినిమాల్లోనూ, ఆ తర్వాత రాజకీయాల్లోనూ రీ-ఎంట్రీ
చాలాకాలం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కనిపించిన విజయశాంతి, మళ్ళీ రాజకీయాల్లోనూ రీ-ఎంట్రీ తరహాలోనే ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. బీజేపీలో చేరాక, కేసీఆర్‌ని ఏకిపారేయడం మొదలుపెట్టారు. తనకంటే కేసీఆర్ పెద్ద నటుడంటూ వెటకారం చేశారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పంచన కేసీఆర్ ఎలా చేరిందీ విజయశాంతి వివరించారు. ఆరేళ్ళలో రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు.? అంటూ కేసీఆర్‌ని నిలదీసేశారు. ఇవన్నీ ఆమె సీరియస్‌గా చేసిన కామెంట్లేనా.? కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది. ఏ పార్టీలో చేరితే, ఆ పార్టీ మౌత్ పీస్‌లా మాత్రమే మాట్లాడే రాజకీయ నాయకులు త్వరగానే తెరమరుగైపోతుంటారు రాజకీయాల్లో.