వామ్మో మగవాళ్లకు మాత్రమే వచ్చే రోగం.. ఇది వస్తే అంతే..!

వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతుండటం సహజం.. అయితే తాజాగా వైద్యులు గుర్తించిన అరుదైన వ్యాధి మగవారిని భయ పెడుతోంది. ఎందుకంటే ఈ వ్యాధి 50 ఏళ్లు దాటిన మగవారికి మాత్రమే వస్తుంది. ఆ వ్యాధి పేరు వెక్సాస్ సిండ్రోమ్ (VEXAS Syndrome). ఈ వ్యాధి వస్తే ఒక్కసారిగా శరీరాన్ని కబళించే ఆటోఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇది. 2020లోనే తొలిసారి ఈ వ్యాధిని అమెరికన్ వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా కనిపిస్తున్నప్పటికీ, ఎవరికి వస్తే వారిని తీవ్ర సమస్యల్లోకి నెడుతోంది.

ఈ వ్యాధి కారణం జన్యువులో జరిగే మార్పులు. శరీరంలోని X క్రోమోజోమ్‌లో ఉండే UBA1 జన్యువులో లోపం తలెత్తితే, శరీర రోగనిరోధక వ్యవస్థ తప్పుగా పనిచేసి, వివిధ అవయవాల్లో వాపులు, ఇన్‌ఫ్లమేషన్‌ కలిగిస్తుంది. మహిళల్లో రెండు X క్రోమోజోమ్‌లు ఉండటంతో ప్రమాదం తక్కువ. కానీ పురుషుల్లో ఒక్కటి మాత్రమే ఉండటంతో, ఈ మార్పు జరిగితే తప్పించుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది.

ఇది వారసత్వంగా రాదు. పుట్టిన తర్వాత ఏదో ఒక సమయంలో, కొత్త కణాలు పుడుతున్నప్పుడు ఈ జన్యువు మారిపోతుంది. ఎక్కువగా ఇది మధ్యవయసు తర్వాతే తలెత్తుతుంది. అమెరికాలో జరిగిన పరిశోధన ప్రకారం, ప్రతి 13,000 మందిలో ఒకరికి ఇది వస్తుంది. కానీ 50 ఏళ్లు దాటిన మగవారిలో మాత్రం ఇది ఎక్కువగా ఉంటుందంట.. సుమారు ప్రతి 4,000 మందిలో ఒకరికి గుర్తిస్తున్నారు.

లక్షణాలు మాత్రం ఊహించని విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముక్కు ఎరుపెక్కడం, చర్మంపై నొప్పి, దద్దుర్లు, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, రక్తం గడ్డలు, రక్తనాళాల వాపు, జ్వరం, తీవ్రమైన అలసట, రక్తహీనత, తెల్లరక్తకణాలు తగ్గిపోవడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం… ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన సమస్యగా ఇది బయటపడుతుంది. ఎముక మజ్జ బయాప్సీలో అసాధారణ మార్పులు కూడా కనిపిస్తాయి.

వైద్యులు చెబుతున్నదేమిటంటే ఈ లక్షణాలు కనిపించగానే జన్యు పరీక్ష చేయించుకోవడం మంచిదని. ఎందుకంటే వెక్సాస్ సిండ్రోమ్ నెమ్మదిగా శరీరాన్ని బలహీనపరుస్తూ, ప్రాణాలను కూడా ప్రమాదం కలిగిస్తుంది. ముందుగా గుర్తిస్తే, చికిత్స ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ 18 తెలుగు ధృవీకరించడం లేదు.)