Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన తొలి నిర్ణయంతోనే వివాదాస్పద పరిస్థితిని ఎదుర్కొన్నారు. అమెరికాలో పుట్టినవారికి తక్షణ పౌరసత్వం కల్పించే చట్టాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర విమర్శల పాలైంది. ఈ చర్య అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఉండగా, దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ట్రంప్ తన నిర్ణయాన్ని “అమెరికా ఫస్ట్” నినాదంతో సమర్థించుకుంటూ, అమెరికన్లకు మరింత అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశ్యమని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వలసదారులు, హక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కొంది. పలు డెమోక్రటిక్ రాష్ట్రాలు కోర్టులో కేసులు నమోదు చేయడంతో ట్రంప్‌కి తొలిసారి చట్టపరమైన సమస్యలు మొదలయ్యాయి.

తాజాగా సియాటెల్ ఫెడరల్ కోర్టు ట్రంప్ తీసుకున్న ఈ చట్టరద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. వివిధ రాష్ట్రాల కోర్టులు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఫెడరల్ కోర్టు తీర్పు ద్వారా ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయం చట్టసమర్థతను కోల్పోయింది.
ఇప్పటికే చైనా, రష్యా, మెక్సికో తదితర దేశాలపై తీసుకుంటున్న ఆంక్షలు, వాణిజ్య చర్చలు కూడా ట్రంప్‌కు కొత్త చిక్కులు తెస్తున్నాయి. రాజకీయ నిపుణులు ట్రంప్‌కి మొదటి నిర్ణయమే ఆయన పాలనకు సమస్యగా మారిందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిణామాలు ఆయన భవిష్యత్తు నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.

