భారత్–పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 16 గంటలకే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. ఈసారి మాత్రం గతం కంటే బోలెడు ముందుకెళ్లారు. ‘వేయి సంవత్సరాలుగా పరిష్కారం లేని సమస్యకు మార్గం చూపేందుకు ఇరు దేశాలతో కలిసి పనిచేస్తాను’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేసిన ట్రంప్, భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మద్దతు తెలిపిందని, ఈ చారిత్రక నిర్ణయానికి తమదీ పాత్ర ఉందని గర్వంగా ప్రకటించారు. అదే సమయంలో, “ఇప్పుడు కశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని నమ్ముతున్నాను” అంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
న్యూఢిల్లీ మాత్రం స్పష్టంగా ఈ విషయంలో తన వైఖరిని ప్రకటిస్తూ వస్తోంది. కశ్మీర్ పూర్తిగా భారత అంతర్భాగమేనని, దీనిపై మూడో పక్షం జోక్యం అంగీకారంలో లేదని ఎన్నిసార్లైనా చెప్పింది. అయినా ట్రంప్ మళ్లీ ఈ అంశాన్ని ప్రస్తావించడాన్ని కొందరు నిఖార్సైన రాజకీయ చతురతగా అభివర్ణిస్తున్నారు.
అంతర్జాతీయ విశ్లేషకులు ట్రంప్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన చూపిస్తున్నారు. ప్రముఖ విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మన్ ట్విటర్లో “ఇంతవరకు ట్రంప్ చేసిన ఆఫర్లలో ఇదే అతిపెద్దదైనది” అంటూ పేర్కొన్నారు. ఆయన 2019లో కూడా ఇలాగే కశ్మీర్ మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న సమయంలో భారత్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మౌనంగానే ఉన్న భారత విదేశాంగ శాఖ, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఒకవేళ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందిస్తే… ఇది మరో డిప్లోమాటిక్ క్లాష్‌గా మారే అవకాశం ఉంది.


