ప్రస్తుత రోజుల్లో మందులు, సబ్బులు, టూథ్‌పేస్ట్, షాంపూల నుంచి ఆహార పదార్థాల వరకు ప్రతీదానికి గడువు తేది ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ మనం రోజూ వాడే లోదుస్తులకు కూడా గడువు తేది ఉందని చాలా మంది ఊహించరు కూడా. సాధారణంగా కుర్చీ, ఫ్యాన్, రేడియో మాదిరిగా ఏళ్ళ తరబడి ఒకే లోదుస్తులు వాడితే ఏమీ కావని అనుకునేవారు చాలామందే ఉన్నారు. కానీ నిపుణులు చెబుతున్నవి వింటే ఇంక మళ్లీ అదే తప్పు చేయరు.
లోదుస్తులు నేరుగా శరీరానికి అంటి ఉంటాయి. ఇవి చెమట, శరీర స్రావాలు, ధూళి ఇవన్నీ లోదుస్తులే పీల్చుకొని బయటకు వెళ్లకుండా చూస్తాయి. కానీ ఇదే ఎక్కువకాలం ఉంటే సమస్య తప్పదని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా లోదుస్తులు జారిపోవడం, చిరిగిపోవడం, ఎలాస్టిక్ వదులు అయితేనే వాటిని బయట పడేస్తారు.. కానీ ఏళ్ల తరబడి వాడిని వాడితే ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు నిపుణులు. లోదుస్తులకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని చెబుతున్నారు. వాటి ఫైబర్స్‌లో ఇన్పెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్ దాక్కుంటాయి. ఇవి సాధారణ ఉతుకుతో పూర్తిగా తొలగిపోవని చెబుతున్నారు.
డాక్టర్ల సూచన ప్రకారం లోదుస్తులు కనీసం ఆరు నెలలకు ఒకసారి లేదా ఎక్కువలో ఎక్కువా ఒక్క సంవత్సరం మాత్రమే వాడాలని అంటున్నారు. ఈ మధ్యలో రంధ్రాలు పడితే, దుర్వాసన ఉంటే, ఎలాస్టిక్ వదులైతే వెంటనే కొత్తవి మార్చుకోవాలని చెబుతున్నారు. నాణ్యమైన కాటన్ మేటీరియల్ వాడటం, ఉతకేటప్పుడు వేడి నీటిలో ఉతకడం, ఎండలో ఆరేయడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరని అంటున్నారు.
లోదుస్తులను ప్రతిరోజూ మార్చకపోతే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, రాషెస్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉందని అంటున్నారు. వ్యాయామం చేసిన తర్వాత లేదా ఎక్కువగా చెమట పట్టినప్పుడు రోజుకు రెండు సార్లు మార్చితే ఇంకా మంచిదని అంటున్నారు. ఇవన్నీ చిన్న విషయాలే అనిపించినా పరిశుభ్రత, ఆరోగ్యానికి ఇవే పునాది.
పెద్ద సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే, కచ్చితంగా లోదుస్తులను క్రమం తప్పకుండా మార్చండి. అవసరమైతే సీజన్లకు సీజన్లు కొత్తవి కొనండి. ధరించినప్పుడు దురద, అసౌకర్యం ఉంటే వెంటనే తీసేసి కొత్తవి వాడండి. ఈ చిన్న జాగ్రత్తలు మీ ఆరోగ్యానికి పెద్ద రక్షణ అవుతాయి.