భారతీయుల ఇంటి ముందు తులసి మొక్క అంటే పవిత్రతకు ప్రతీక. ఉదయం దీపం వెలిగే చోట తులసి వాసన వ్యాపిస్తే ఇంటంతా ఒక శాంతిమయమైన తత్వం నెలకొంటుంది. తులసిలో లక్ష్మీదేవి వాసముంటుందనే నమ్మకం శతాబ్దాల నాటి సంప్రదాయం. అందుకే తులసిని ఆరాధనలో భాగంగా చూపించడమే కాదు, ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఆనందాన్ని అందించే శుభచిహ్నంగా భావిస్తారు. అయితే తులసి పూజలో కొంతమంది పాటించే పొరపాట్లు తెలియకుండానే ప్రతికూల ఫలితాలు తెచ్చే ప్రమాదం ఉందని పండితులు సూచిస్తున్నారు.
తులసి దగ్గర పూజ చేయడం అంటే కేవలం దీపం వెలిగించడం మాత్రమే కాదు.. పరిశుభ్రమైన దుస్తులతో, నిశ్చలమైన మనసుతో తులసిని ఆరాధించడం అత్యవసరం. పండితుల మాటల్లో చెప్పాలంటే.. తులసి సాత్విక శక్తికి నిలయం. అది స్వచ్ఛతను మాత్రమే స్వీకరిస్తుంది. అయితే చాలామంది పూజలో ఉపయోగించే ప్రతి వస్తువును తులసి దగ్గర ఉంచేస్తారు. ఇదే పెద్ద తప్పుని చెబుతున్నారు.
ప్రత్యేకంగా శివార్చనలో ఉపయోగించే బిల్వపత్రం, పారిజాతం వంటి పుష్పాలు తులసి దగ్గర పెట్టకూడదని శాస్త్రాలు స్పష్టం చేస్తాయి. కథల ప్రకారం శివుడు జలంధరుడిని సంహరించిన సంఘటన వల్ల తులసి మరియు శివపూజా పదార్థాల మధ్య అనుకూలత ఉండదని చెబుతారు. అందువల్ల శివుడి నైవేద్యం, పుష్పాలు, బిల్వపత్రం వంటి వస్తువులను తులసి దగ్గర ఉంచకపోవడం ఉత్తమం.
ఇక కొంతమంది తులసికి పాలు కలిపిన నీరు పోయడం శుభమని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహ. పాల్లో ఉండే కొవ్వు తులసి వేర్లను దెబ్బతీసి మొక్క కుళ్లిపోవడానికి కారణమవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా ప్రతికూలంగా పరిగణించబడుతుంది. మొక్క ఎండిపోవడం ఇంట్లో శాంతి తగ్గడానికీ, అనవసర విభేదాలు పెరగడానికీ సూచనగా భావిస్తారు.
తమసిక లక్షణాలకు సూచికగా పరిగణించే నల్లనువ్వులు, నల్ల విత్తనాలు వంటి వస్తువులు కూడా తులసి దగ్గర ఉంచరాదని శాస్త్రం సూచిస్తోంది. తులసికి పసుపు, కుంకుమ, పరిశుభ్రమైన నీరు, తేనెలాంటి సాత్విక పదార్థాలు మాత్రమే అర్పించడం శ్రేయస్కరం. ఇలా చిన్న విషయాలను పాటించడం వల్ల తులసి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆరోగ్యంగా పెరిగిన తులసి మొక్క ఇంటి శ్రేయస్సు, శాంతి, సానుకూల శక్తులను ఆకర్షిస్తుందని పండితులు చెబుతున్నారు.
మరో ముఖ్య విషయమేమిటంటే.. తులసి మొక్కకు సాయంత్రం తర్వాత నీరు పోయకూడదు. అది తులసి జీవశక్తిని ప్రభావితం చేస్తుందని శాస్త్రాలు సూచిస్తాయి. ఉదయం సూర్యకాంతి ఉన్న సమయం తులసికి నీరు పోయడానికి ఉత్తమమైనదే. వీటి వంటి చిన్న నియమాలు పాటిస్తే మొక్క శీఘ్రంగా పెరుగుతుంది, ఇంట్లో ఆధ్యాత్మిక శాంతి కూడా కొనసాగే అవకాశం ఉంటుంది.
