Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్‌ నెల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్‌ విడుదల..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానములు) కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోటాలు వంటి అనేక విభాగాల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఈనెల 18వ తేదీ నుంచి వివిధ కోటాల విడుదల ప్రారంభం కానుంది.

సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఈ టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ విధానాన్ని పాటించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసే గడువు జూన్ 20 ఉదయం 10 గంటల వరకూ ఉంటుంది. డిప్‌లో ఎంపికైన భక్తులు జూన్ 20 మధ్యాహ్నం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా టికెట్‌కి చెల్లింపు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల కోటా జూన్ 21 ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ కోటాలు బుక్ చేసుకోవచ్చును.

తిరుమలలో ప్రాచీన ఆచారం అయిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటా జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా అదేరోజు ఉదయం 11 గంటలకు విడుదల అవుతుంది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘరోగులకు ప్రత్యేక దర్శనం కోసం.. ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా జూన్ 23 మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానుంది. ఈ టోకెన్ల ద్వారా ఆ విభాగాల భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనాన్ని పొందవచ్చు.

సెప్టెంబర్ నెలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (రూ.300) కోటా జూన్ 24 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల చేస్తారు. ఆగస్టు నెలకు గాను శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్‌వైజర్ సేవల కోటా జూన్ 25 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. ఈ సేవలన్నింటిని https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. తగిన సమయాల్లోనే లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులను కోరుతోంది. అంతేకాదు టైమ్‌లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కసారి కోటా పూర్తయిన తర్వాత తిరిగి అవకాశం దొరకడం కష్టమవుతుంది. కనుక ముందే అప్రమత్తంగా ఉండడం ఉత్తమం.