(అశోక్ జోగుపర్తి)
ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాం అని సీఎం కెసిఆర్ ప్రకటించడమే తరువాయి రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాలతో ఒక పార్టీ కి మించి మరొక పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థులు ఆశావహులతో అన్ని పార్టీ కార్యాలయాలు కళ కలలాడుతున్నయ్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొత్త పొత్తులు పొడుచుకుని ఏ పార్టీ కి ఎంత లాభం చేస్తాయో, ఏ అభ్యర్థికి టికెట్ వస్తుందోనని అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికి ఎన్నికల పండక్కి అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి.
ఇప్పుడు సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు, రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా ఉత్తమ్ గెలుపు నల్లేరుపై నడకలా ఉండేది. ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదన్నది సుస్పష్టం. గత ఎన్నికల్లో ఉత్తమ్ కి ప్రత్యర్థి గా తెరాస అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కు టికెట్ కేటాయించింది. ఉత్తమ్ విజయాన్ని ఆమె ఏ మాత్రం ఆపలేకపోయారు. తెలంగాణ వాదం ఇక్కడ లేకపోవటం, రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండటం ఈ రెండు ఆమె ఓటమికి ప్రధానాంశాలు గా మారాయి. ఉత్తమ్ పట్ల నియోజక వర్గంలో కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అతను ప్రజలకు అందుబాటులో ఉండడని, కార్యకర్తలపై కోపగించుకుంటాడని ఇక్కడ ప్రజల అభిప్రాయం. అభివృద్ది విషయంలో మాత్రం కొంత మంచి మార్కులే ఇస్తున్నారు. ఇక్కడి ప్రజలు. ఇక ఆయన గెలుపుకు కారణం ఏదైనా ఉందంటే అది బలహీనమైన ప్రత్యర్థులే. గతంలో పలు పార్టీలు తరపున నిలిపిన అభ్యర్థులు అందరూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. ఎప్పుడొస్తారో కూడా తెలియదు.
సిఆర్ ఉత్తమ్ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించాడు. పీసీసీ అధ్యక్షుడిని ఓడిస్తే కాంగ్రెస్ నైతిక బలం సగం దెబ్బతింటుందన్నది వారి భావన. ఆ వ్యూహంలో భాగంగానే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన నేతను బరిలోకి దించుతున్నారు. శానంపూడి సైదిరెడ్డి అనే ఒక ఎన్నారై ని తెరాస ఉత్తమ్ కి పోటీగా భరిలోకి దింపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరిదీ ఒకటే సామాజిక వర్గం కావటం తో ఈసారి పోటి కాస్త తీవ్రంగానే ఉండబోతోంది. ఇద్దరు ఆర్థికంగా బలవంతులు. సైదిరెడ్డి తల్లి తండ్రులు ఇద్దరు గతంలో తెదేపా తరపున సర్పంచులుగా పనిచేసిన వారే కావటంతో అతనికి నియోజకవర్గ వ్యాప్తంగా ఆ పార్టీ తరపున సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతని విద్యాభ్యాసం అంతా ఇక్కడే చదువుకోవటం, స్థానికుడు కావటం, ‘సై’ కార్యక్రమం పేరిట నియోజక వర్గ వ్యాప్తంగా పర్యటనలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. అందుకే శంకరమ్మ నియోజక వర్గ ఇంఛార్జి గా ఉండి కూడా సైదిరెడ్డి చేసే ఏ కార్యక్రమానికి తెరాస అడ్డుచెప్పలేదు. ఈ మద్యకూడా సీఎం అతనికి టికెట్ కేటాయించే అంశంపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇక అతని బలం, బలహీనతల విషయానికొస్తే….
ఇదే ప్రాంతానికి చెందిన వాడు కావటం, గతంలో తెదేపా లో పనిచేసిన అనుభవం, ఆర్థికంగా కూడా బలవంతుడు కావటం ఇతనికి కలిసొచ్చే అంశాలు.
బలహీనతలు విషయానికొస్తే తెరాసలో వర్గపోరు ఎక్కువగా ఉంది. శంకరమ్మ శివారెడ్డి, అల్లం ప్రభాకర్ రెడ్డి వర్గాలు ఇతనికి ఏమాత్రం సపోర్ట్ చేస్తాయన్నది మాత్రం చూడాలి.
ఇక భాజపా కూడా పీసీసీ అధ్యక్షుడి విషయం లో కాస్త కరకుగానే ఉంది. మొన్నటి వరకు ఇక్కడ భాజపా అభ్యర్థి బొబ్బా భాగ్యరెడ్డి ఇంఛార్జి కొనసాగుతున్నాడు. కానీ ఇంతలో అనూహ్యంగా రాష్ట్ర బీసీ నేత, నల్గొండ డీసీఎమ్మెస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు ను భాజపా తెరపైకి తీసుకొచ్చింది. అతడినే ఉత్తమ్ కి పోటీగా రంగంలోకి దింపాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివరలో గాని, వచ్చే నెల మొదటి వారంలో గాని అధికారికంగా భాజపా కండువా కప్పుకోవటానికి సిద్దమవుతున్నాడు. ఇతను గతంలో ఉత్తమ్ కి ప్రధాన అనుచరునిగా ఉన్నాడు. ఆయన బలం, బలహీనతలు తెలిసిన వ్యక్తి. రాష్ట్ర బీసీ నాయకుడిగా ఉంటూ నియోజకవర్గంలోని బీసీలను కొంతమేర సంఘటిత పరిచాడు. బీసీల వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి అది తన ఒట్లుగా మలచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అత్యంత బలమైన మండలం గా ఉన్న మేళ్లచెరువు ఇతని సొంత స్థలం కావటం తో ఇతని పోటీ పీసీసీ అధ్యక్షుడికి చేటు చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా గతంలో కంటే ఈ సారి జరిగే ఎన్నికలు పీసీసీ అధ్యక్షునికి గట్టిగానే సవాల్ విసురుతున్నయి.
ఇక తెదేపా, లెఫ్ట్ పార్టీలు ఉనికిని కాపాడుకోవడానికి తప్ప ప్రభావం చూపటం కష్టం
(రచయిత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో జర్నలిజం విద్యార్థి. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయితవి మాత్రమే.)