కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో హైదరాబాద్ మహానగరంలో దాదాపు రెండు వారాలకు పైగా సాగిన హడావుడి మొత్తం గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ముగిసింది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి గ్రేటర్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్ని తలపించేలా సాగాయనే చెప్పొచ్చు. ఈ ఎన్నికలు ఒక పార్టీని ఆలోచనలో పడేస్తే, మరో పార్టీ ఎలాంటి అంచనాలు లేని చోట తన ఉనికిని చాటింది. ఇంకోపార్టీ తన స్థానాలు చెక్కుచెదరకుండా నిలబెట్టుకుంది.
ఈ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా బరిలోకి దిగిన మూడు పార్టీల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా నగర ప్రజలు మాత్రం ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టించారనే చెప్పొచ్చు. ఇంకో ప్రధాన పార్టీ మజ్లిస్ ఎప్పటిలాగే ఎంతమంది వచ్చినా తన అడ్డాలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం ఎవరి ఊహించని విధంగా టీఆర్ఎస్‌కు దగ్గరగా వచ్చి దాదాపు ఓడించినంత పనిచేసింది.
గత ఎన్నికల్లో 99 సీట్లతో సెంచిరీ కొట్టినంత పనిచేసిన టీఆర్ఎస్ ఈసారి 55 సీట్ల దగ్గరే ఆగిపోయిందనే బాగానే దెబ్బతిన్నదని చెప్పాలి. మరోవైపు గత ఎన్నికల్లో 4 సీట్లు మాత్రమే దక్కించుకున్న బీజేపీ ఈసారి అనూహ్యంగా 48 సీట్లు గెల్చుకుని అధికార పార్టీని వణికించింది. అయితే జీహెచ్ఎంసీలో అతిపెద్దపక్షంగా టీఆర్ఎస్ అవతరించినా, ఆ పార్టీ నాయకుల ముఖాల్లో ఆనందం లేదు.. గులాబీ శ్రేణులు ఎలాంటి సంబరాలు చేసుకోలేదు.
దక్షిణాదిన సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ అనుకున్నంత పనీ చేయలేకపోయినా దాదాపుగా టీఆర్ఎస్‌కు దగ్గరగా వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ, సెంటిమెంట్‌తో ఇక్కడి ప్రజల్లో బలంగా పాతుకుపోయిన టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ఈసారి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్ని వేదికగా చేసుకుని తన అమ్ములపొదిలోకి పాచికలన్నీ వాడేసింది.
ఈ ఒక్కమెట్టు ఎక్కేస్తే తెలంగాణలో పాగా వేసినట్లే అని భావించిన బీజేపీ దాదాపు అనుకున్నది చేయడంలో సఫలం అయ్యింది. ప్రస్తుతానికి అయితే నగర పేదల్లో ఇంకా సింహభాగం టీఆర్‌ఎస్ వైపే ఉన్నా ముందు ముందు టీఆర్ఎస్‌కు మరింత ప్రమాదం పొంచిఉందనేది రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలిచిన టీఆర్ఎస్‌కు దుఃఖాన్నీ మిగిల్చగా, కొద్దితేడాతో ఓడిన బీజేపీకి మాత్రం అంతులేని ఆనందాన్ని కల్గించింది. మరి ఈ ఎన్నికల్లో గెలిచి ఓడిందెవరు.. ఓడి గెలించిందెవరో ఈపాటికి అర్ధమై ఉంటుంది.