రైలు ప్రమాదం.! అలా జరగడానికి ఛాన్సే లేదు.!

లూప్ లైన్‌లో గూడ్స్ ట్రెయిన్ ఆగి వుందట. మెయిన్ లైన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు దాదాపు ఒకే వేగంతో వెళుతున్నాయట.! అనూహ్యంగా మెయిన్ లైన్‌లో వెళ్ళాల్సిన రైలు, లూప్‌లైన్‌లో వున్న గూడ్స్ రైలుని ఢీ కొట్టిందట.. ఇదీ ఓ ప్రచారం. కాదు కాదు, ఇదే వాస్తవమంటోంది రైల్వే శాఖ కూడా.

ఓ సూపర్ ఫాస్ట్ రైలు, ఆగివున్న గూడ్స్ రైలుని ఢీకొట్టి, చెల్లాచెదురైపోవడంతో, వేరే ట్రాక్ మీద వెళుతున్న రైలు, అప్పటికే పట్టాలు తప్పిన రైలు తాలూకు బోగీల్ని ఢీకొంది. దాంతో, ప్రమాద తీవ్రత పెరిగింది.

దాదాపు 300 మంది ప్రాణాలు బలికొన్న ఒరిస్సా రైలు ప్రమాదంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన బోగీల్ని వినియోగిస్తున్న రెండు ప్రయాణీకుల రైళ్ళు ప్రమాదానికి గురైతే.. ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకోవడమేంటి.?

ఈ కోచ్‌లు ఒకవేళ రైలు ప్రమాదం జరిగినా, ఒకదాని మీదకు ఒకటి ఎక్కే పరిస్థితి వుండదు. కానీ, ఎక్కేశాయ్. అంటే, ఎక్కడో తేడా జరిగింది. ఆ తేడా ఏంటన్నదే ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్.

రైల్వే శాఖ ఈ విషయంలో నిజాలు చెప్పడంలేదా.? ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించడంలేదా.? అన్న అనుమానాలు సగటు ప్రజానీకంలో కలుగుతున్నాయి. అత్యాధునిక కోచ్‌లు ఎంతవరకు భద్రం.? అన్న అనుమానాలు పెరుగుతున్నాయ్.