నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన రైల్వే శాఖ.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

ఇండియన్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే, గోరఖ్‌పూర్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ner.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

37 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలతో పాటు 09 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (సిగ్నల్) ఉద్యోగ ఖాళీలు, 9 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు, 19 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (ఇంజనీరింగ్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

60 శాతం మార్కులతో పాసైన జనరల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 55 శాతం మార్కులు ఉంటే అర్హత కాగా మిగిలిన అభ్యర్థులు 50 శాతం మార్కులను కలిగి ఉండాలి. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.

జనరల్/ఓబీసీకి ఫీజు రూ.500గా ఉండగా మిగతా అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఎక్స్ కేటగిరీ అభ్యర్థులకు నెలకు రూ. 30,000 ఉండనుండగా వై కేటగిరీ అభ్యర్థులకు 27,000 రూపాయలు, జడ్ కేటగిరీ అభ్యర్థులకు 25,000 రూపాయల వేతనం లభించనుంది.