ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అట్టహాసంగా ‘వందే భారత్’ రైళ్ళను ప్రారంభిస్తున్నారు. వర్చువల్ పద్ధతిలోనో, ప్రత్యక్షంగానో.. పదే పదే ఒకే రైలుని ప్రారంభించడమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు.!
ఆ రైళ్ళతో ప్రధాని నరేంద్ర మోడీ చేసుకుంటున్న పబ్లిసిటీ, సగటు రైలు ప్రయాణీకుడికే కాదు, సగటు భారతీయుడికి చిరాకు తెప్పిస్తోంది. ఇంత పబ్లిసిటీ యావ ఎందుకు.? అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.
అబ్బే, ఒక్కటే రైలు కాదు.. ఫలానా చోట నుంచి ఫలానా చోటకి.. దేశవ్యాప్తంగా కొత్తగా రైళ్ళను ప్రవేశపెడుతున్నప్పుడు, వాటిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తే తప్పేంటి.? అని బీజేపీ మద్దతుదారులు వాదించొచ్చుగాక.! కానీ, ఇది అస్సలు సమర్థనీయం కాదు.
మొన్నామధ్య కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇక్కడా భారీగానే వుండే అవకాశముంది. ఈ రైలు ప్రమాదాలు ఏం హెచ్చరికల్ని పంపిస్తున్నాయి.?
పబ్లిసిటీ పక్క పెట్టి, సరిగ్గా పని చెయ్యాలన్న విషయాన్ని ఈ రైలు ప్రమాదాలు చెప్పకనే చెబుతున్నాయి. మావన తప్పిదం, సాంకేతిక తప్పిదం.. అని పాలకులు సరిపెట్టుకుంటే కుదరదు కదా.? ప్రాణాలు పోతున్నాయక్కడ.! రైలు ఎక్కాలంటేనే భయమేసే పరిస్థితి ఎదురవుతోంది.
ఏదో ఒక్క ప్రమాదం జరిగితే ఇంత యాగీనా.? అంటే, ఇది యాగీ కాదు బాధ.! ఆవేదన. ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, దాంతోనూ పబ్లిసిటీ చేసుకునే పాలకులకి, బాధ్యత తెలిసి రావాలి. వస్తుందా మరి.?