Mahesh Kumar Goud: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు కేసీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘దీక్షా దివస్’ పేరుతో కేసీఆర్ ఆడుతున్నది కొత్త నాటకమని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష కేవలం ఒక నాటకమని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన సెంటిమెంట్‌ను వాడుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన దీక్షను మూడు రోజులకే ముగించి పారిపోయే ప్రయత్నం చేశారని, అయితే విద్యార్థి లోకం, ఉద్యమకారుల ఆగ్రహం చూసి భయపడే ఆ దీక్షను కొనసాగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేవలం ఒక్క కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల పోరాటాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీల ఆత్మబలిదానాలు, కాంగ్రెస్ పార్టీ కృషితోనే రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ కల సాకారమైందని గుర్తు చేశారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడితే.. గత పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు అధికారం కోల్పోవడంతో, ప్రజల్లో సానుభూతి పొందేందుకు కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ అస్త్రం తీస్తున్నారని, ప్రజలు ఈ నాటకాలను గమనిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

