BRS – Congress: తెలంగాణలో బీఆర్ఎస్‌ను వలసల దడ మళ్లీ చుట్టుముట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గెలిచిన 39 సీట్లలో 10 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత, పార్టీ మీద ఒత్తిడి మరింత పెరిగింది. తాజాగా హైకోర్టు తీర్పు తర్వాత మళ్లీ వలసల భయం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ (BRS), హైకోర్టు తీర్పు పట్ల ఆశాభావం కలిగి ఉండింది.
అయితే, కోర్టు తీర్పులో స్పీకర్‌కు నిర్ణయం తీసుకోవడంలో కాలపరిమితి లేదని, తగిన సమయంలో డెసిషన్ తీసుకోవాలని సూచించడంతో బీఆర్ఎస్ నిరాశ చెందింది. దీంతో పార్టీ నుంచి మళ్లీ వలసలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాలు మరింత ఉత్సాహాన్ని పెంచాయి. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను మరింత కుదిపేశాయి. కేటీఆర్ చుట్టూ తిరిగే కొన్ని కీలక నేతలు తమతో టచ్లో ఉన్నారని మహేశ్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలపై నిఘా పెంచి, చర్చల ద్వారా వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.
Batti Vikramarka: తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు.. భట్టివిక్రమార్క ఏమన్నారంటే..
వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుత శక్తిసామర్థ్యాలను బట్టి మూడు స్థానాలు కాంగ్రెస్‌కు, ఒక్క సీటు బీఆర్ఎస్‌కు దక్కే అవకాశం ఉంది. అయితే, ఆ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్‌కు దక్కకుండా కాంగ్రెస్ (Congress) ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao), కవిత (Kavitha) వంటి నేతలు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉండేలా వారికి భరోసా కల్పిస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ఇంతలోనే వలసలు ఆగిపోవాలని పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బుజ్జగింపులు విజయం సాధిస్తాయా, లేక కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా అన్నది రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వలసల ఆట కొనసాగుతూ, రెండు పార్టీల మధ్య టెన్షన్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.