సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో జరుగుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఎంతో మందికి అగ్గి పరీక్ష రానుంది. కేసీఆర్ ఐదేళ్ల పాలనలో సరిగ్గా మధ్యలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఓరకంగా కేసీఆర్ పాలనకు మార్కులు వేయనుంది. ఎన్నికల ఫలితాలు కేసీఆర్ పాలనకు రెఫరెండం కానున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి తోడు వ్యక్తిగతంగా ఈ ఎన్నికలు చాలా మంది పనితీరుకు పరీక్షగా నిలిచాయి.
టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకమే …
దుబ్బాక ఉపఎన్నికల్లో గులాబీదళం గెలిస్తే కేసీఆర్ పావులారిటీ ఇంకా తగ్గలేదన్న సంకేతాలు తెలంగాణ వ్యాప్తంగా వెళ్తాయి. ప్రజలకు కేసీఆర్ పై ఇంకా నమ్మకం ఉందనే సంకేతాలు వెళ్తాయి. ఒకవేళ ఓడిపోతే ఈ ప్రభావం త్వరలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై పడుతుంది. వరదల కారణంగా అధికార పార్టీపై హైదరాబాదీయులు చాలా కోపంతో ఉన్నారు. దుబ్బాకలో ఓటమి ఈ అగ్గికి ఆజ్యం పోయనుంది.
హరీష్ రావు పై ఎలా…
సొంత జిల్లాలో జరుగుతున్న ఈ ఉపఎన్నికలు హరీష్ రావు సత్తా కు అగ్గిపరీక్షే. ఇప్పటి వరకు ఎక్కడ ఉపఎన్నిక వచ్చినా అక్కడ వాలిపోయి టీఆర్ఎస్ ను గెలిపించుకుంటూ వచ్చి…. ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్న హరీష్ రావుకు దుబ్బాక ఓటమి ఢిఫెన్స్ లో పడేసే ప్రమాదం ఉంది. చాలా చోట్ల టీఆర్ఎస్ క్యాడర్ లోపాయికారిగా కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డికి మద్దతు ఇస్తోంది. ఈకారణంగా హరీష్ రావుకు సొంత జిల్లాలోనే క్యాడర్ పై పట్టుతప్పిందనే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది.
బండి సంజయ్ కు ఎలా అంటే….
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ ఎదుర్కొంటున్న మొదటి అసెంబ్లీ ఉపఎన్నిక ఇది. నిజామాబాద్ లోకసభ ఎన్నికల్లో గెలుపు పతాకం ఎగరేసిన బీజేపీ…ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసింది. చాలా మంది బీజేపీ నాయకులు టీఆర్ఎస్ లోకి వలస వెళ్లారు. కార్యకర్తల పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఇది నిజంగా ఎదురుదెబ్బే. మరో వైపు కరీంనగర్ లో కూడా చాలా మంది బీజేపీ కార్పోరేటర్లు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సొంత నియోజకవర్గంలోనే క్యాడర్ ను కాపాడుకోలేకపోయారన్న అపఖ్యాతి నుంచి ఆయన బయటపడవచ్చు. గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ ఒకవేళ దుబ్బాకలో గెలిస్తే… ఆ ప్రభావం తెలంగాణ అంతటా పడుతుంది. ముఖ్యంగా బీజేపీ బలంగా ఉన్న జంటనగరాల్లో రానున్న గ్రేటర్ ఎన్నికలకు ఇది ఆక్సీజన్ లా పనిచేయనుంది.
రఘునందన్ రావుకు ఎలా అంటే…
ఈయనకు ప్రశ్నించే గొంతుకగా మంచి పేరుంది. న్యాయవాదిగా సక్సెస్ అయిన ఈయన… టీవీ చర్చల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే శక్తి ఉన్న ఈయనకు ఇప్పటి వరకు రాజకీయంగా మంచి అవకాశం రాలేదు. బీజేపీ దుబ్బాకలో బలంగా లేకపోయినప్పటికీ వ్యక్తిగత ఇమేజ్ తో హల్ చల్ చేస్తున్నారు. ఒకవేళ దుబ్బాకలో ఈయన గెలిస్తే క్యాడర్ ను నియోజకవర్గం అంతా తయారు చేసుకొగలరు. తద్వారా మంచి రాజకీయ భవిష్యత్తు ఈయనకు దక్కనుంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎలా అంటే…
రాష్ట్ర పార్టీకి ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉన్న కిషన్ రెడ్డికి ఈ ఉపఎన్నిక చాలా కీలకమైంది. ఆయన కేంద్రమంత్రి అయిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇది. ఇక్కడ గెలిస్తే కేంద్రంలో ఈయన పలుకుబడి పెరుగుతుంది. లేదంటే మంత్రి పదవి ఇచ్చినా ఈయన వల్ల పార్టీకి క్షేత్ర స్థాయిలో ఒరిగేది ఏమీ లేదన్న సంకేతాలు వెళ్తాయి.
కాంగ్రెస్ పార్టీకి ఎలా గంటే….
దుబ్బాకలో కాంగ్రెస్ గెలిస్తే… తెలంగాణలో పార్టీకి తిరుగు ఉండదు. ఈ విజయంతో తెలంగాణ వ్యాప్తంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ యాక్టివ్ అవుతుంది.
ఉత్తం కుమార్ రెడ్డికి ఎలా గంటే….
దుబ్బాకలో ఓడిపోతే అది పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫెయల్యూర్ గా ఏఐసీసీ పెద్దలు చూస్తారు. తద్వారా ఆయన త్వరలోనే పీసీసీ పగ్గాలను పదిలి పెట్టాల్సి వస్తుంది.
చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఎలా అంటే….
దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి, నియోజకవర్గంలో మంచిపేరుంది. మూడుదశాబ్దాల రాజకీయ చరిత్రలో, మచ్చలేని నేతగా పేరుంది. ఆ సానుభూతితోపాటు, పార్టీ క్యాడర్ దన్ను కూడా శ్రీనివాసరెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోంది. శ్రీనివాసరెడ్డి కూడా గట్టిగానే పోటీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇటీవలే బయటకు వచ్చేసిన నేపథ్యంలో గులాబీ క్యాడర్ ను కూడా తన వెంట తీసుకెళ్లారు. అయితే తండ్రి చెరుకు ముత్యం రెడ్డి మరణం తర్వాత లైమ్ లైట్ వచ్చేందుకు దొరికిన మంచి అవకాశం ఇది. ఇక్కడ గెలిస్తే ఆయన సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తుకు పునాది పడనుంది.
రేవంత్ రెడ్డికి ఎలాగంటే…
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ గా రేవంత్ రెడ్డి దుబ్బాకలో అగ్గిరాజేశారు. ఈయన సభలకు జనం బాగానే వస్తున్నారు. దుబ్బాకలో గెలిస్తే సభలకు వచ్చిన వాళ్లు రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేశారనే సంకేతాలు వెళ్తాయి. ఈ గణాంకాలను ఆయన ఏఐసీసీ పెద్దలకు చూపించి మార్కులు కొట్టేయవచ్చు. ఢిల్లీ పెద్దలకు మరింత దగ్గర కావచ్చు.
ప్రస్తుత పరిస్థితి….
దుబ్బాకలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉన్న పోటీలో బీజేపీ తన స్థానాన్ని దక్కించుకోగలిగింది. ఇప్పుడు బీజేపీ కూడా గట్టిగా పోటీని ఇస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు రెండు బలంగా పోటీ ఇస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అది టీఆర్ఎస్ కలిసిరానుంది. అయితే దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు పై నడకేమి కాదని అంటున్నారు రాజకీయ నిపుణులు. ఎవరు గెలుస్తారో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది దుబ్బాక నెలకొని ఉంది.