రాయలసీమ మీద సినిమా దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు…

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

(సినిమా… ఎవరికీ హాని చేయని అమాయకపు మీడియం కాదు.సినిమా నిండా పాలిటిక్స్ ఉంటాయి. పగ ఉంటుంది. కసి ఉంటుంది. అసూయ వుంటుంది.అవినీతి,అక్రమాలూ ఉంటాయి. అందుకే  నాలుగు రాళ్ల కోసం బలహీనుల్ని, వెనకబడిన ప్రాంతాలను, అట్టడుగు వర్గాలను హత మార్చే సాధనమయేందుకు సినిమా ఎపుడూ సిద్ధంగా ఉంటుంది. సినిమా విషం చిమ్ముతుంది.  సినిమా కత్తి అవుతుంది, తుపాకి అవుతుంది. కాటేసే విష సర్పమవుతుంది.    అపుడపుడు నిన్న జరిగినట్లు రోడ్డు ప్రమాదమూ అవుతుంది.  రాయలసీమ కామెంటేటర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  జలం శీనును బలిగొన్న నిన్నటి ప్రమాదం, సినిమా గురించి స్పందన- ఎడిటర్)

 

వాడు వక్రమో,అక్రమ సంతానమో తెలియదు…

నోట్లో బుల్లెట్ పెట్టుకున్న వాళ్లను చూడలేదు..చూపినోడి కొంపలో నడిపే కంపెనీలో విటులకు నోటితో పాన్ అందించేదీ చూడలేదు…
ఐదు రూపాయల ఫాక్షన్ చూడలేదు..కానీ కొన్నిచోట్ల రైలు కట్టల పక్కన ఐదు రూపాయల వ్యభిచారం గురించి వినడమే తప్ప చూడలేదు…
కొడుకులను చంపుకున్న తండ్రులను చూడలేదు..కానీ తీసుకున్న అప్పుకు తాను,కూతురిని తార్చుకున్న తల్లుల కథలు చదివి తల్లడిల్లాను…

రైల్లో ఆర్య-2 డబ్బింగ్ సినిమా లాప్‌టాప్ లో చూస్తూ ఎవడో కశ్మీరీ వ్యాపారానికి కోయంబత్తూర్ పోతూ పెనుగొండ కొండలు చూపించి ఈ సినిమాలో చూపించింది ఇక్కడేనా అని అడుగుతాడు…
ఇతర రాష్ట్రాల్లో చదవడానికి పోయిన విద్యార్థులనూ వింతగా ప్రశ్నిస్తారు…
కొన్ని ప్రాంతాల్లో అద్దె కొంపలకూ,పిల్లల స్కూల్ అడ్మిషన్లప్పుడూ అమ్మో అంటారు..

పవర్‌ఫుల్ మాస్ మీడియాలో ఎంత నీచంగా ఒక ప్రాంతాన్ని అవహేళన చేసినా ఖండిస్తూ ఒక పోస్ట్ పెట్టరు కానీ వందల మంది చదివే నా పోస్టుల్లో గుమ్మం బయట పరాయివాడి చెప్పులుంటే ఇంటి యజమానీ లోపలికి పోడట అన్న అపోహ కొన్నిప్రాంతాల వారి మీద ఇతర ప్రాంతాల వారికుంది అంటే మాత్రం దుఖం తన్నుకొస్తుంది…

మొన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు..నిన్న ఒక టీవీ చానెల్ డిబేట్ కు పోతూ దుర్ఘటనలో ఒకరి మృతి,ఇద్దరికి తీవ్రగాయాలు…
ఆ కుటుంబాలకు జరిగిన నష్టానికి బాధ్యులెవరు?

బాధ్యత లేకుండా ఎప్పుడో ముగిసిన ఫాక్షనిజం మీద నానా చెత్త తీసి జనాల మీద వదిలే ఈ కంపెనీ పుత్రులది కాదా…

వీళ్ల కొంపల బయట చెప్పులు వదిలి మావాళ్లెంత బాకీ పడ్డారో…మా వెనకాల పడి సొమ్ము చేసుకుంటున్నారు..

వెటకారాలు చేస్తే వదలకండి..ఈ సినిమాజాతిని వాకిలి బయట చెప్పులు అనేసెయ్యండి..

(గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫేస్ బుక్ వాల్ నుంచి)