సంక్రాంతి పండుగకు సొంతూర్ల బాట పట్టే లక్షలాది వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. పండుగ రోజులలో హైవేలపై టోల్ చార్జీల భారం లేకుండా చేయాలన్న ఆలోచనను సర్కార్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టోల్ ఫీజును ప్రభుత్వమే భరిస్తే, ప్రయాణికులకు ఆర్థికంగా ఊరట కలగడమే కాకుండా ట్రాఫిక్ సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రతి ఏడాది సంక్రాంతి వేళ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు తమ సొంత గ్రామాలకు ప్రయాణిస్తుంటారు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో కలిసి స్వంత వాహనాల్లో బయలుదేరడం వల్ల జాతీయ రహదారులపై రద్దీ ఒక్కసారిగా పెరుగుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా మారుతోంది.
ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం దిశగా పండుగ రోజులలో టోల్ ఫ్రీ విధానం అమలు చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని ద్వారా ప్రయాణం మరింత సాఫీగా సాగడంతో పాటు ప్రమాదాల అవకాశాలు కూడా తగ్గుతాయని భావిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూలు తగ్గితే హైవే ప్రయాణం వేగవంతంగా మారనుంది.
అయితే టోల్ ఫీజుల వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో, దీనికి కేంద్ర అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణించే వాహనదారుల టోల్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే విజయవాడ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ వంటి ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. టోల్ మినహాయింపుతో పండుగ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, “సంక్రాంతి పండుగతో పాటు మేడారం జాతర సమయంలో టోల్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఫ్రీ వే కల్పించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని నిర్ణయించాం. పండుగ వేళ ప్రజలు ఇబ్బంది లేకుండా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
