ABV Again : సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, పోస్టింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఇంకోసారి వెళ్ళి నిరాశ చెందాల్సి వచ్చింది. చీఫ్ సెక్రెటరీని కలిసి తనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ఏబీవీ గతంలోనే అభ్యర్థించారు ఏబీవీ.
ఇటీవల, ఏబీవీపై సస్పెన్షన్ చెల్లదంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన దరిమిలా, పోస్టింగ్ కోసం ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే, ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేందుకు జగన్ సర్కారు సుముఖత వ్యక్తం చేయడంలేదు. పైగా, సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేసేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు షురూ చేసిందన్న ప్రచారమూ జరుగుతోంది.
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా ఏబీవీ పని చేశారు. అయితే, ఆ సమయంలో ప్రభుత్వం తరఫున పని చేయాల్సిన ఏబీవీ, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారన్న విమర్శలున్నాయి. వాటికి తోడు, పదవిని అడ్డం పెట్టుకుని ఏబీవీ అక్రమాలకు తెరలేపారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ పరికరాల్ని కొనుగోలు చేశారనీ, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారనీ ఏబీవీపై జగన్ సర్కారు ఆరోపణలు చేసింది, ఆ ఆరోపణతోనే ఆయన్ని సస్పెండ్ చేసింది.
ఈ వ్యవహారంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తన సస్పెన్షన్‌ని న్యాయస్థానంలో సవాల్ చేసిన ఏబీవీ, కేంద్రాన్నీ ఈ విషయమై పలుమార్లు సంప్రదించారు. సుప్రీంకోర్టులో ఎట్టకేలకు ఊరట దొరికినా, ఏపీ సర్కారు మాత్రం ఆయనకు పోస్టింగ్ ఇవ్వడంలేదు.