ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రావడం అన్నది కేంద్రంలో బిజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం సాధ్యంకాని పనని ప్రజలంతా ఎప్పుడో తేల్చేసారు. కేంద్రానికి ఏపీ అవసరం ఉంటేనో?..అత్యయిక పరిస్థితి వస్తేనో తప్ప ప్రత్యేక హోదా అనేది అసాధ్యం. కేంద్రంలో అధికారం చేతులు మారితేనో! అప్పటి పరిస్థితులను బట్టి జరిగే విషయమది. అప్పటివరకూ ఏపీకి ప్రత్యేక హోదా వస్తాది అనుకోవడం కూడా వృద్ధా ప్రయత్నమన్నది నిపుణుల సహా ప్రజల మాట. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో నాయకులు విచ్చలవిడిగా రాజకీయాలు చేయడం నాటి నుంచి చూస్తున్నదే. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హోదా విషయంలో ఎలా రియాక్ట్ అయ్యే వారో చెప్పాల్సిన పనిలేదు.
ఇక వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా స్పందిస్తున్నారో కూడా తెలిసిందే. అయితే ఇప్పటి సర్కార్ మాట్లాడే మాటలో ఓ అర్ధం…ఓ పరమార్ధంది ఉంది. కేంద్రంలో బీజేపీ ఎవరి మద్దతు లేకుండా స్వతంత్రగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి…ఈ విషయంలో జగన్ చేసేది కూడా ఏమీ లేదు. ఇదే విషయాన్ని సీఎం జగన్ ఎన్నోసార్లు పబ్లిక్ గానే చెప్పారు. అయితే లోపం లేకుండా హోదా విషయంలో తన ప్రయత్నం మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఉద్ఘాటించారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హోదా పై కుండ బద్దలుకొట్టేసారు.
బుధవారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నానని ..రాదేమోనని అన్నారు. అయినా ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేస్తారని ధీమా వ్యక్తం చేసారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు జగన్ పూర్తి స్వేచ్ఛ నిచ్చారన్నారు. పార్లమెంట్ కు వెళ్లాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందన్నారు. రెవెన్యూ మంత్రిగా ఏడాది కాలం చాలా సంతృప్తిగా పని చేసానన్నారు. ఎంపీలు ఎవరైనా పార్టీకి విధేయులుగా ఉండాలని.. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాలని ఎంపీ రఘురామకృష్ణమరాజు విషయాన్ని ప్రస్తావించారు.