టీడీపీలో తిరుపతి టెన్షన్‌.. వివాదం సద్దుమణగలేదా.?

Tirupati controversy not settled?

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఏమోగానీ, మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటే కాస్త ఎక్కువగా తెలుగుదేశం పార్టీ హైరానా పడుతోంది. అందరికంటే ముందుగా తిరుపతి ఉప ఎన్నిక కోసం టీడీపీ అభ్యర్థిని ప్రకటించేసిన సంగతి తెల్సిందే. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, తిరుపతి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారు. అయితే, ఆమె తొలుత పోటీ చేసేందుకు నిరాకరించగా, ఎట్టకేలకు ఆమెను ఒప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలో హైడ్రామానే నడిచింది. అభ్యర్థిగా తన పేరు ఖరారయ్యాక కూడా తిరుపతి లోక్‌సభ పరిధిలో పనబాక లక్ష్మి ఎలాంటి పొలిటికల్‌ యాక్టివిటీ మొదలు పెట్టకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఇంట్లో శుభకార్యం వుండడంతో, ఆ పనుల్లో బిజీగా వుండడం వల్లే పనబాక లక్ష్మి, రాజకీయంగా యాక్టివ్‌ అవలేదట. పార్టీ శ్రేణులు తనకు సహకరించాలంటూ పనబాక లక్ష్మి, స్వయంగా పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేసి ఊరుకున్నారట. దాంతో, టీడీపీ నేతలూ లైట్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Tirupati controversy not settled?
Tirupati controversy not settled?

ఇదిలా వుంటే, తిరుపతి ఉప ఎన్నిక విషయమై భారతీయ జనతా పార్టీ తన వ్యూహాల్లో నిమగ్నమైపోయింది. పైకి వేడి చల్లారినట్టు కనిపిస్తున్నా, తెరవెనుక మంత్రాంగం గట్టిగానే జరుగుతోందట. బీజేపీ ఏపీ నేతలు, జనసేన పార్టీకి చెందిన ముఖ్య నేతలు, బీజేపీ అధిష్టానంతో టచ్‌లో వున్నారట. మొత్తం మంత్రాంగమంతా ఢిల్లీ వేదికగానే జరుగుతోందనీ, ఈ క్రమంలో కొందరు తెలంగాణ బీజేపీ నేతలూ తమవంతుగా సూచనలు, సలహాలు ఇస్తున్నారని సమాచారం. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నదీ తేలకపోయినా, బీజేపీ నుంచే అభ్యర్థి వుండొచ్చన్నది ప్రాథమికంగా అందుతోన్న సమాచారం. కాగా, పనబాక లక్ష్మి విషయంలో బీజేపీ, తమదైన వ్యూహాల్ని ఇప్పటికే ఖరారు చేసిందట. ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు తెరవెనుక ప్రయత్నాలు గతంలోనే జరిగాయి. ఆమె బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఏమీ లేరు. ఆ మాటకొస్తే, చంద్రబాబే.. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి లేదు.

అనవసరంగా మరీ ఎక్కువ కష్టపడిపోవాల్సిన అవసరం లేదనీ, తిరుపతిలో టీడీపీ నామమాత్రపు పోటీ మాత్రమే ఇస్తుందనీ ఇప్పటికే సంకేతాలు బయటకొచ్చిన దరిమిలా, పనబాక లక్ష్మితో ఇంకా కొందరు బీజేపీ నేతలు టచ్‌లో వున్నారట.. బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడా స్వరం వినిపించొద్దని ఆమెను కోరుతున్నారట. చిత్రమేంటంటే, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ కూడా అగ్రెసివ్‌గా వెళ్ళే పరిస్థితి లేదు. సెంటిమెంట్‌ కలిసొచ్చి తమకు విజయం చేకూరుతుందనే ధీమాతో వుంది వైసీపీ. ప్రస్తుతానికి బీజేపీని వైసీపీ సీరియస్‌గా తీసుకోకపోయినా, ముందు ముందు వాతావరణం వేడెక్కొచ్చు. కానీ, బీజేపీ పట్ల చాలా విషయాల్లో వైసీపీ కూడా చూసీ చూడనట్లే వ్యవహరిస్తోంది. సో, ఎలా చూసినా.. బీజేపీకి పెద్దగా తిరుపతి ఉప ఎన్నికతో టెన్షన్‌ వుండకపోవచ్చు. కాస్తో కూస్తో టెన్షన్‌ వుంటే అది టీడీపీకే. గట్టిగా బీజేపీని విమర్శించలేక, వైసీపీని ఎదుర్కోలేక నానా తంటాలూ పడాల్సి వస్తుంది టీడీపీకి.

తీరా కష్టపడ్డాక, పనబాక లక్ష్మి చివరి నిమిషంలో హ్యాండిస్తేనో.? అంటూ ఓ టీడీపీ సీనియర్‌ నేత, పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తాజాగా తన వాదనను విన్పించారట. దాంతో, తిరుపతి ఉప ఎన్నిక విషయమై కొత్తగా టీడీపీలో మళ్ళీ రచ్చ మొదలయ్యిందని అంటున్నారు.