Tirumal: తిరుమల శ్రీవారి ఖజానాలో ఉన్న బంగారం ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు..!

తిరుమల కలియుగ వైకుంఠం. ఇక్కడి స్వామివారికి భక్తుల సమర్పించి కానుకుల సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి సన్నిధిలోకి అడుగుపెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఆ భక్తి ప్రతీకగా వారు సమర్పించే కానుకలు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు శ్రీవారి ఖజానాను నిపుతూనే ఉంటారు. స్వామివారికి శతాబ్దాల క్రితమే శ్రీకృష్ణ దేవరాయలు వజ్రాభరణాలు, బంగారు కానుకలు సమర్పించినట్టు శాసనాలు చెబుతున్నాయి. తరువాత మైసూర్ మహారాజులు కూడా స్వామివారి ఆలంకారానికి పసిడి సమర్పించారు. ప్రస్తుతం కూడా ఈ పరంపర కొనసాగుతోంది.

నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ తరఫున వజ్రకిరీటం చేయించగా, గాలి జనార్థన్ రెడ్డి 42 కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని సమర్పించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా స్వామి వారికి బంగారు ఆభరణాలు ఇచ్చి తన భక్తిని చాటుకున్నారు. ఇలా తరతరాలుగా కొనసాగుతున్న విరాళాల పరంపరలో తాజాగా ఓ అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారాన్ని శ్రీవారికి సమర్పించారు. దీని విలువ సుమారు 140 కోట్లు. ఈ విరాళం వెలుగులోకి రాగానే భక్తులు ఆశ్చర్యపోయారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టీటీడీ ఖజానాలో 10,000 కిలోలకుపైగా బంగారం ఉంది. వీటిలో 1100 రకాల స్వర్ణాభరణాలు, 376 వజ్ర వైడూర్యాలతో చేసిన నగలున్నాయి. ముందుగా ఈ బంగారాన్ని కరిగించి భక్తులకు విక్రయించేవారు. కానీ 2010 నుంచి మింట్ బదులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వడ్డీ ఆదాయాన్ని ఆలయ నిర్వహణకు వినియోగిస్తున్నారు. దీంతో స్వామివారి ఆర్థిక బలం మరింత పెరిగింది.

తిరుమలలో అత్యంత పవిత్రమైన ఆచారం హుండీలో వేసే ముడుపు. చిన్న నాణెం అయినా, పెద్ద నోట్ అయినా, పసిడి, వెండి అయినా… భక్తి మనసుతో సమర్పించిన తర్వాత అది తిరుమలేశుడికే చేరుతుంది. హుండీ ఆదాయం రోజూ కోట్ల రూపాయలుగా వస్తుంది. ఈ కానుకలు కేవలం రూపాయల విలువలో కాకుండా, ప్రతి ఒక్కరి భక్తి నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి. కొందరు పిల్లలు తాము దాచుకున్న జేబు ఖర్చును వేసేస్తారు. గృహిణులు తాము కష్టపడి దాచుకున్న నాణేలు సమర్పిస్తారు. వ్యాపారులు తమ లాభాల్లో భాగం చెల్లిస్తారు.

ఇలా తిరుమలలో సమర్పించే ముడుపు, కానుకల వెనుక ఉన్న అసలు భావన ఆర్థిక విలువ కాదు. అది భక్తుడి హృదయంలో ఉన్న విశ్వాసం, శ్రద్ధ. ఒక రూపాయి అయినా, వంద కోట్లు అయినా.. శ్రీవారి సన్నిధిలో సమానమే. అందుకే హుండీలో పడే ప్రతి కానుక, ప్రతి ముడుపు కలియుగదైవం వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.