‘విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో వైసీపీ గెలిస్తే, మూడు రాజధానులకు ప్రజలు అనుకూలం అనే భావిస్తాం..’ అని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు మునిసిపల్ ఎన్నికల వేల చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చిత్రమేంటంటే, మూడు చోట్లా టీడీపీ మట్టికరిచేసింది. అధికార వైసీపీ విజయదుందుభి మోగించేసింది. నిజానికి వైసీపీ కూడా, విజయవాడ విషయంలో కొంత అయోమయంలో పడింది. విశాఖ విషయంలోనూ కొన్ని అనుమానాలు ఆ పార్టీకి వున్నాయి.
అయితే, ఎక్కడా ఎలాంటి సమస్యా లేకుండా.. చాలా తేలిగ్గానే వైసీపీ తన పని పూర్తి చేసేసుకోగలిగింది విజయవంతంగా. కర్నూలు సంగతి సరే సరి. నిజానికి, మునిసిపల్ ఎన్నికల్ని మూడు రాజధానులతో ముడిపెట్టడం అనేది సరైన ఆలోచన కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే చంద్రబాబు, తనకు ఇష్టమొచ్చిన రీతిలో రాజకీయాలు చేస్తూ వుంటారు.. అపహాస్యంపాలవుతుంటారు. ఇకపై, టీడీపీ అమరావతి పేరుతో ఏం పోరాటం చేయగలుగుతుంది.? నిజానికి, అమరావతికి ఈ దుస్థితి పట్టించిందే తెలుగుదేశం పార్టీ.
టీడీపీ గనుక, అమరావతి పేరుతో నాటకాలు ఆడి వుండకపోతే, అమరావతి రైతులతో అధికార వైసీపీ చర్చలు జరిపి వుండేది. అమరావతి రైతులూ, ప్రభుత్వం ముందు తమ డిమాండ్లు వుంచేవారు.. వాటిని పరిష్కరించుకునేవారు కూడా. అమరావతి రైతులకు భ్రమలు కల్పించి, ప్రభుత్వమ్మీదకు ఉసిగొల్పి చంద్రబాబు సాధించిందేంటి.? త్వరలో కర్నూలులో న్యాయ రాజధానికి శంకుస్థాపన చేస్తాం.. మే నెలలో విశాఖ నుండే జగన్ పాలన ప్రారంభం.. ఇలాంటి ప్రకటనలు అధికార వైసీపీ నుంచి అంత ధైర్యంగా వచ్చాయంటే, మునిసిపల్ ఎన్నికల విషయంలో టీడీపీ చేతకానితనాన్ని ముందే వైసీపీ ఎంత పక్కగా అంచనా వేయగలిగిందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ట్రాప్‌లో పడి టీడీపీ విలవిల్లాడింది మునిసిపల్ ఎన్నికల సందర్భంగా.