అప్పుడు రాష్ట్ర విభజన.. ఇప్పుడు రాజధాని విభజన.!

అప్పుడేమో రాష్ట్ర విభజన.! ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడం వల్ల తెలంగాణకు లాభం చేకూరింది తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు. కొత్త పేరుతో పాత రాష్ట్రం తెలంగాణ.. పాత పేరుతో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.! వెరసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయానికి గురైంది. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్.

అలా ఇంకోసారి విభజన జరిగితే కష్టమన్న కోణంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చామంటోంది వైసీపీ. ఇదసలు లాజిక్ లెస్ వ్యవహారం.! జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత సంఖ్యా పరంగా జిల్లాలు పెరిగాయి తప్ప, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో వచ్చిన అదనపు మార్పు ఏమీ వుండదు కదా. ఆ లెక్కన, మూడు రాజధానుల అవసరం కొత్త రాష్ట్రానికి ఏమొచ్చింది.?

తెలంగాణలో ఇంకో రాజధాని ఆలోచన లేదు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా మరో రాజధాని అన్న ఆలోచన లేదు. కేవలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మూడు రాజధానుల పేరుతో హంగామా నడుస్తోంది. అధికారంలో వున్న పార్టీ, ఓ కొత్త ఆలోచన చేసింది. ఆలోచన చేయడంలో తప్పేమీ లేదు. కాకపోతే, ఆచరణలో అదెలా సాధ్యమవుతుంది.? దాని వల్ల రాష్ట్రానికి అదనంగా కలిగే ప్రయోజనమేంటి.? అన్నది ఆలోచించుకోవాలి కదా.?

విశాఖలో ఈ నెల 15న ‘గర్జన’ పేరుతో వైసీపీ ఓ పెద్ద కార్యక్రమం చేపట్టబోతోంది. పేరుకే నాన్ పొలిటికల్ జేఏసీ, తెరవెనుకాల మొత్తం కథ నడిపేది వైసీపీనే. ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని రాజకీయ వ్యూహాలు వుండొచ్చు. కానీ, వాటి వల్ల పార్టీకి ఎంత ప్రయోజనం.? రాష్ట్రానికి ఎంత  ప్రయోజనం.. అన్నదీ ఆలోచించుకోవాలి కదా.?

రాజధానుల విభజన కాస్తా, రాష్ట్ర విభజనకు దారి తీస్తే, ఆ తర్వాత వైసీపీ పరిస్థితి ఏమవుతుంది. రాయలసీమలో ఎప్పటినుంచో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వుంది. ఉత్తరాంధ్రలోనూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వుంది. ఆ డిమాండ్లు రాజధాని విభజనతో ఊపందుకుంటే.? దాని వల్ల కలిగే నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు.?