తెలంగాణలో ఈ నల్లగొండ జిల్లా సర్పంచ్ ‘‘ఒకే ఒక్కడు’’

రాజకీయాలు రెండు రకాలు. నీతి, నిజాయితీతో, నైతిక విలువలతో, ప్రజలకు మేలు చేయాలన్న తలంపు కలిగి విలువలతో కూడిన రాజకీయాలు ఒకరకమైతే… అవినీతి, భూకబ్జాలు, బెదిరింపులు, మాఫియాలు పెంచిపోశించడం, డబ్బులు,మందు ఇచ్చి ఓట్లు కొనడం, కోట్లు కూడబెట్టడం లాంటివి విలువలు లేని రాజకీయాలు రెండో టైపు. దేశంలో మొదటిరకం రాజకీయాలు చేసేవారు అతి తక్కువ మోతాదులో కనబడతారు. నూటికో కోటికో ఒక్కరు అన్నట్లు ఉంటారు. కానీ రెండో రకం రాజకీయ నాయకులు అడుగడుగునా కనబడతారు. మనం మాట్లాడుకుంటున్న ఈ మాజీ సర్పంచ్ తొలి రకం కు చెందిన వ్యక్తి. ఆయన కథేంటో చదవండి.

పాండురంగారావు, మాజీ ఆలగడప సర్పంచ్

2001 గ్రామపంచాయతీ ఎన్నికలు నల్లగొండ రాజకీయాల్లో అనేక రికార్డులు నెలకొల్పాయి. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేనేపల్లి పాండురంగారావు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆయన ప్రత్యర్థిగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన పుల్లారెడ్డి బరిలో నిలిచారు. ఆ సమయంలో1600 ఓట్లు సాధించారు పాండు రంగారావు. ప్రత్యర్థి పుల్లారెడ్డికి 750 ఓట్లు వచ్చాయి. అప్పటి మిర్యాలగూడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి బంధువే పుల్లారెడ్డి. తన బంధువు పుల్లారెడ్డి గెలుపు కోసం తిప్పన విజయసింహారెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశారు. సర్వ శక్తులు ఒడ్డినా పాండు రంగారావు విజయాన్ని ఆపలేకపోయారు.

అయితే పాండురంగారావు సర్పంచ్ గా గెలవగానే కమిషన్లు, కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడలేదు. రెండేళ్లలోనే గ్రామ రూపు రేఖలు మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. గ్రామంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

ఆలగడప గ్రామంలో మందు బందు పెట్టించాడు. గుట్కా పాకిట్లు నిషేధించాడు. సిగరెట్లు, గంట సుట్టల అమ్మకాలు నిలిపివేయించాడు. ప్రజల ఆరోగ్యాలను పాడు చేసే ఈ అలవాట్లు మాన్పించేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామ యువతను చైతన్యపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రేమ పెళ్లిళ్లు జరిపించి మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పారు. ఇలా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న మహిళలు

దీంతో రెండేళ్లు గడిచిన తర్వాత పాండురంగారావు దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు చేయని సాహసానికి ఒడిగట్టాడు. అదేమంటే తన పాలన మీద ప్రజలు ఏమనుకుంటన్నారో తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసమే తన రెండేళ్ల పాలన పూర్తి కాగానే ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) కు తెర లేపారు. తన రెండేళ్ల పాలన నచ్చిందా? లేదా అన్నదానిపై గ్రామంలో ఓటింగ్ జరిపించాడు పాండురంగరావు.

2003 ఆగస్టు 17వ తేదీన పాండు రంగారావు గ్రామంలో రెఫరెండం జరిపించారు. జన విజ్ఞాన వేదిక, మానవ హక్కుల వేదిక, లోక్ సత్తా వంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్ జరిగింది. భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక సర్పంచ్ ఇలా తన పాలన మీద రెఫరెండం పెట్టుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఈ ఓటింగ్ లో తాను ప్రజాప్రతినిథిగా ఉండాలా? వద్దా? అన్న ఆప్సన్స్ ఓటర్లకు ఇచ్చారు. ఈ ఓటింగ్ లో 1789 మంది గ్రామ ఓటర్లు పాల్గొన్నారు. ఆయన ప్రజాప్రతినిథిగా కొనసాగాలంటూ 1710 మంది ఓటు వేయగా, 73 ఓట్లు దిగిపోవాలని వచ్చాయి. మరో ఆరు ఓట్లు చెల్లుబాటు కాకుండా మురిగిపోయాయి. 2001 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఆయనకు మరో వంద ఓట్లు ఎక్కువే వచ్చాయి.

రెఫరెండం సమయంలో ఓట్ల కౌంటింగ్ సీన్

ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న పాండు రంగారావు ఒకవేళ తనకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం వచ్చి ఉంటే పదవి నుంచి దిగిపోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆయన మిగత కాలం కూడా సర్పంచ్ గా ఉండాలంటూ జనాలు తీర్పు ఇవ్వడంతో కంటిన్యూ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే? ఈ ఓటింగ్ కోసం అవసరమైన ఖర్చు మూడు వేల రూపాయలను తన సొంత డబ్బే వెచ్చించారు పాండు రంగారావు.

పాండు రంగారావు మరో సంచలన నిర్ణయం  

పాండు రంగారావు 2003లో రెఫరెండం పెట్టుకున్న అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆయన ఎన్నికలో ఫలితం ఎలా వస్తుందా అని జాతీయ మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూసింది. ఆనాడు జాతీయ మీడియాలో కూడా ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు పాండు రంగారావు ఇలా రెంఫరెండం పెట్టుకున్న తొలి వ్యక్తిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2006 లో చోటు దక్కించుకున్నారు.

గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు

ఇక పాండు రంగారావు మరో కీలక నిర్ణయం గురించి తెలిస్తే మరింత ఆశ్చర్యం కలగకమానదు. ఏ పదవి అయినా ఒకసారే చేపట్టాలన్నది పాండు రంగారావు ఆలోచన. అందుకోసమే ఆయన ఐదేళ్ల సర్పంచ్ పదవి చేపట్టిన తర్వాత మళ్లీ గ్రామస్తులంతా ఎంతగా రిక్వెస్ట్ చేసినా తిరిగి సర్పంచ్ గా పోటీ చేయలేదు. ఒక పదవిని ఒకసారే చేపట్టాలన్నది తన ఆశయం అని అందుకోసమే మళ్లీ సర్పంచ్ గా పోటీ చేయాలని గ్రామస్తులు కోరినప్పటికీ తాను ఆ ప్రయత్నం చేయలేదని ‘‘తెలుగురాజ్యం’’ కు వెల్లడించారు పాండు రాంగారావు.

పాండు రంగారావు ను బాబు బంగారం అంటారు

పాండు రంగారావును గ్రామస్తులు బాబు అని పిలుస్తారు. తన జీవితమంతా పాండు రంగారావు ప్రజాసేవలోనే గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన స్వగ్రామం ఆలగడపలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ప్రజలు మెచ్చిన వారే ప్రజా నాయకులుగా ఉండాలి తప్ప… డబ్బుతో, మందుతో గెలిచిన వారంతా ప్రజానాయకులు కాలేరని పాండు రంగారావు చెబుతుంటారు. ప్రజల అభిమానం ఉన్నవారే ఎన్నికల్లో పోటీ చేయాలని సూచిస్తారాయన. 

మంచినీటి నల్లాలు ఏర్పాటు చేసిన పాండురంగారావు

పాండు రంగారావు  ఆనాడు ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థిగా ఉన్న టిఆర్ఎస్ నేత పుల్లారెడ్డి తో సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. పుల్లారెడ్డి మచ్చలేని నాయకుడు, జెంటిల్మెన్ అని ఇప్పటికీ చెబుతుంటారు పాండు రంగారావు. ఆ సమయంలో కూడా పాండురంగారావుతో మాట్లాడిన తర్వాతే పుల్లారెడ్డి నామినేషన్ వేసినట్లు గ్రామస్తులు చెబుతుంటారు. పోలింగ్ రోజు పుల్లారెడ్డి బండి మీదే పాండు రంగారావు తిరిగారని గ్రామస్తులు ఆసక్తికరంగా చెబుతారు. 

పాండు రంగారావు టెన్త్ లో ఉన్న సమయంలో 1979లో మట్టి మనుషులు అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారానే ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సర్పంచ్ గా కాకముందు, అయిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయం చేసుకుంటూనే ఆయన ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. 

ఓటింగ్ లో పాల్గొన్న ఆలగడప గ్రామ ప్రజలు

 

మచ్చలేని మట్టి మనిషి పాండురంగారావుకు అడుగడుగునా బెదిరింపులు…

పార్ట్ 2 స్టోరీ… త్వరలో ప్రచురిస్తాం చదవండి.