కన్నకూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్నకసితో తండ్రి రగిలిపోయాడు. ఆమె సోదరుడు కసి పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుని పోలీసుల సహకారంతో ఊరికి వచ్చిన ఆ జంటను చూసి వారు సహించలేకపోయారు. పోలీసులు గ్రామ పొలిమేరలు దాటిన వెంటనే అమ్మాయి మీద కర్రలతో దాడి చేశారు. చచ్చేవరకు కొట్టారు. తర్వాత శవాన్ని గ్రామ సమీపంలో ఉన్న గుట్ట వద్ద తగలబెట్టారు. అంతేకాదు ఆ బూడిదను నీటిలో కలిపారు. అప్పుడు వారి పగ చల్లారింది. పూర్తి వివరాలు చదవండి.
ఆమె పేరు అనురాధ. ఆమ సొంతూరు మంచిర్యాల జిల్లా జన్నారం మండంలోని కలమడుగు. ఆమె హైదరాబాద్ లో ఉన్నతచదువులు చదువుకున్నది. హైదరాబాద్ లో చదివేరోజుల్లోనే అదే గ్రామానికి చెందిన సహచర విద్యార్థి అయిన అయ్యోరు లక్ష్మణ్ అనే పద్మశాలి యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ ఈనెల 3వ తేదీన హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.
శనివారం సాయంత్రం పోలీసుల సహకారంతో 5.30 గంటల సమయంలో కలమడుగు గ్రామానికి చేరుకున్నారు. అయితే రాత్రి ఏడున్నర సమయంలో పోలీసులు వెళ్లిపోయారు. దీంతో వారు వెళ్లిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్తుల ముందే అనురాధ తండ్రి సత్తన్న, సోదరుడు మహేష్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులు కర్రలతో కొట్టారు. గ్రామస్తులు అందరూ చూస్తుండగానే ఆమెను కర్రలతో చితకబాదారు. ప్రాణం పోయేవరకు దాడి చేశారు.
ఆమె మరణించిన తర్వాత మృతదేహాన్ని గ్రామ సమీపంలో ఉన్న గుట్ట వద్ద కాల్చివేశారు. అనంతరం కాల్చిన బూడిదను నీళ్లలో కలిపి కిరాతకంగా వ్యవహరించారు. పరాయి కులం వాడిని ప్రేమ పెళ్లి చేసుకున్నందుకే అమ్మాయి అనురాధ తండ్రి, కుటుంబసభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. పెద్దలను ఎదురించి లవ్ మ్యారెజ్ చేసుకున్నందుకు పగ పెంచుకుని తండ్రి సొంత కూతురినే మట్టు పెట్టారని తెలిపారు.
ఈ ఘటనలో పోలీసుల సహకారం తీసుకున్నప్పటికీ అమ్మాయి తల్లిదండ్రుల్లో ఉన్న పగను వారు గుర్తించలేకపోయారు. వారి సహకారం తీసుకుని గ్రామానికి వెళ్లినా వారిని పోలీసులు కాపాడలేకపోయారు. ఈ కేసులో అనురాధ తండ్రి, సత్తన్న, అన్న మహేష్ ఇద్దరూ పరారీలో ఉన్నారు.
అనురాధ లక్ష్మణ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన అనురాధ పేరెంట్స్ ఆమెను కొట్టి తిట్టి వేధించారు. అంతేకాకుండా ఆమె మీద వత్తిడి తెచ్చి లక్ష్మణ్ పై పోలీసు స్టేషన్ లో వేధింపుల కేసు పెట్టించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకపోగా చివరకు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లిని జీర్ణించుకోలేక హత్యకు తెగబడ్డారు ఆమె కుటుంబసభ్యులు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.