ఒకవైపు టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. మరోవైపు మహా కూటమి కూడా హీట్ పెంచింది. సీట్ల లెక్క తేల్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మహా కూటమిపై రాజకీయ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇంతకాలం టిఆర్ఎస్ పంచన ఉన్నవారిలో అవకాశాలు రాని వారంతా మహా కూటమి వైపు చూస్తున్నారు. నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఆ వివరాలు చదవండి.
నల్లగొండలో అధికార టిఆర్ఎస్ పార్టీకి ఇటీవల జెడ్పీ ఛైర్మన్ బాలూ నాయక్ గుడ్ బై చెప్పారు. ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉండేవాడు. జెడ్పీ ఛైర్మన్ అయిన బంగారు తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయనకు దేవరకొండ అసెంబ్లీ టికెట్ దక్కుతుందన్న ఆశతో అప్పట్లో టిఆర్ఎస్ లో చేరారు. కానీ అక్కడ సిపిఐ పార్టీలో గెలిచిన రవీంద్రకుమార్ కూడా బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కోసం కారెక్కేశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రవీంద్రకుమార్ కే టిఆర్ఎస్ సీటు దక్కింది. దీంతో బాలూ నాయక్ టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.
తాజాగా బాలూ నాయక్ బాటలోనే మరో నాయకుడు కూడా టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన నాయకుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి బుధవారం సాయంత్రం గాంధీభవన్ లో ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అలుగుబెల్లి మిర్యాలగూడ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. కాంగ్రెస్ నేత భాస్కర్ రావు మీద ఓడిపోయారు. అయితే రెండో స్థానంలో నిలిచారు అలుగుబెల్లి.
కొంగర కలాన్ సభ తర్వాత మారిన సీన్
అయితే బంగారు తెలంగాణ ఫార్ములా ఇక్కడ కూడా పనిచేసింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా బంగారు తెలంగాణ సాధించాలన్న పట్టుదలతో టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. టిఆర్ఎస్ లో రోజురోజుకూ బిటి బ్యాచ్ హవా పెరిగిపోతూ ఉద్యమ బ్యాచ్ ప్రతిష్ట మసకబారిపోతున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో భాస్కర్ రావే పోటీ చేస్తారని టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. కంగర కలాన్ సభ వరకు తనకు ఈసారి టికెట్ వస్తుందని అలుగుబెల్లి బాగా హుషార్ గా టిఆర్ఎస్ కోసం పనిచేశారు. కానీ ఎప్పుడైతే బిటి బ్యాచ్ భాస్కర్ రావే టిఆర్ఎస్ అభ్యర్థి అని ప్రకటించడంతో అలుగుబెల్లి నిరాశ చెందారు. ఇక తనకు టికెట్ రాదని తేలిపోవడంతో టిఆర్ఎస్ కు గుబ్ బై చెప్పేయాలనుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలికింది.
అలుగుబెల్లి కి నియోజకవర్గంలో బాగానే పట్టు ఉందని చెబుతున్నారు. ఈసారి టిఆర్ఎస్ టికెట్ దక్కితే అలుగుబెల్లి గ్యారెంటీగా గెలిచేవాడని అంటున్నారు. కానీ బిటి బ్యాచ్ అదృష్టం పండి భాస్కర్ రావుకే టిఆర్ఎస్ లోనూ టికెట్ దక్కింది. దీంతో అలుగుబెల్లి బయట పడ్డారు. అయితే భాస్కర్ రావు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆయనకు టికెట్ ఇస్తే మూడో ప్లేస్ కు పోవడం ఖాయమని అల్గుబెల్లి వర్గం ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో సర్వే ఫలితాలను పరిగణలోకి తీసుకుని తనకు టికెట్ గ్యారెంటీ అని ఆయన భావించినా కేసిఆర్ సిట్టింగ్ లకే మళ్లీ చాన్స్ ఇచ్చేశారు.
బుధవారం సాయంత్రం అలుగుబెల్లి కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరి కాంగ్రెస్ టికెట్ ఆయనకే దక్కుతందా లేదంటే మిగతావారెవరైనా ఆ టికెట్ కొట్టేస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పిసిసి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అలుగుబెల్లికి టికెట్ మాత్రం గ్యారెంటీ ఇవ్వలేదని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని టికెట్ అంశాన్ని పరిశీలిస్తామని మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది.
ఏధి ఏమైనా రేస్ గుర్రం లాంటి లీడర్ అలుగుబెల్లి పోటీ చేయకుండా టిఆస్ఎస్ లో భాస్కర్ రావు చుట్టు తిరుగుడేందని ఆయన అనుచరులు వత్తిడి చేసినట్లు తెలుస్తోంది. టికెట్ వచ్చినా రాకున్నా టిఆర్ఎస్ భాస్కర్ రావును ఓడించేందుకైనా పార్టీకి గుడ్ బై చెప్పాలన్న అభిమానులు, అనుచరుల వత్తిడి మేరకే అలుగుబెల్లి కారు దిగిపోతున్నారని చెబుతున్నారు.