దేశంలో మత రాజకీయాలు కొత్తేమీ కాదు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు ఎప్పటినుంచో నడుస్తూనే వున్నాయి. ఆంధ్రపదేశ్ ఇందుకు మినహాయింపు ఏమాత్రం కాదు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన మత రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పడు అది ఇంకాస్త ఎక్కువ జుగుప్సాకరమైన స్థాయికి చేరిపోయిందంతే. చంద్రబాబు హయాంలో పుష్కరాల పేరుతో క్రిష్ణా నది ఒడ్డున వున్న కొన్ని దేవాలయాల్ని కూల్చివేయడం అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.
పెద్దగా తేడా ఏం లేదు. చంద్రబాబు హయాంలో అలా, వైఎస్ జగన్ హయాంలో ఇలా.. అనుకోవాల్సి వస్తోందంతే. సంక్షేమ పథకాల అమలులో సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న వైఎస్ జగన్ సర్కారు, ఈ తరహా వివాదాల్ని ప్రోత్సహించి, తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని అనుకోలేం. కానీ, ఆయా ఘటనలపై ప్రభుత్వ స్పందన మాత్రం వుండాల్సిన స్థాయిలో వుండడంలేదన్నది నిర్వివాదంశం. యంత్రాంగం చేష్టలుడిగా చూస్తుండడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో ఈ తరహా ఘటనల్ని పోలీసు యంత్రాంగం నిలువరించలేకపోతోందంటే, ఖచ్చితంగా ఇది వ్యవస్థ వైఫల్యమే.
ఈ క్రమంలో ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు వినిపిస్తున్న వేళ.. మతం పేరుతో ఈ రాజకీయమేంటి.? అన్న అంశం తెరపైకొస్తోంది. చర్చిలపై, మసీదులపై దాడులు జరిగితే.. యంత్రాంగం ఎంత వేగంగా కదులుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, దేవాదాయ శాఖ వుండి కూడా, దేవాలయాలకు రక్షణ లేని ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ సమాజం తరఫున గొంతు బలంగా వినిపించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది ఆయా రాజకీయ పార్టీలకు. అంతమాత్రాన, ఆయా పార్టీలపై మతం ముద్ర వేసెయ్యడం ఎంతవరకు పబబు.? ప్రభుత్వ యంత్రాంగం ఇకనైనా చర్యలు వేగవంతం చేయకపోతే, దోషులను గుర్తించి, శిక్షించకపోతే.. అది ప్రభుత్వానికి అత్యంత ఖరీదైన తప్పిదంగా మారిపోతుందన్నది నిస్సందేహం. ప్రభుత్వ యంత్రాంగం చర్యలతోపాటు, అధికార పార్టీ నేతలు.. ఈ ఘటనలపై రాజకీయ విమర్శలు చేయడం మానేసి.. ఆయా ఘటనలపై చిత్తశుద్ధితో స్పందించకపోతే.. హిందూ సమాజం హర్షించదు.