విషాదభరిత వదనంతో అరవైనాలుగు నిముషాలపాటు పరకాల వారు నిర్మించిన ఈ డాక్యుమెంటరీలో అమరావతిని సమర్ధిస్తూ నలుగురు పచ్చనాయకులు, కమ్యూనిస్టు ముసుగు వేసుకుని పచ్చ మాటలు మాట్లాడే కొందరు కమ్యూనిస్టులు, ఇద్దరు ముగ్గురు మేధావులు, కనిపించారు. కానీ అధికారపార్టీ నుంచి ఆయనకు ఒక్కరే దొరికారు! మరొకాయన అధికారప్రతిపక్ష నాయకుడు.
ఆ కనిపించిన నలుగురు పచ్చ నాయకులలో ఒకాయన మీద బోలెడన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
నాలుగో ఐదో నిరాహారదీక్షా శిబిరాలు కనిపించాయి. ఏ షాట్ లోనూ కనీసం యాభై మంది రైతులు కనిపించలేదు.
ఇక ఎక్కడో దక్షిణాఫ్రికా వారి అభిప్రాయాలు సేకరించిన పరకాల అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ వెళ్లి అక్కడి వాసుల అభిప్రాయాలను మాత్రం సేకరించలేకపోయారు. అమరావతిలోని రాజధాని పట్ల ఆ ప్రాంతవాసులు ఎంత సంతోషిస్తున్నారో పరకాలవారికి తెలియలేదు మరి!
అమరావతి పేరుతో, సీఆర్డీఏ పేరుతో జరిగిన భూ ఆక్రమణలు, లాండ్ పూలింగులు, పంటలను తగలబెట్టడాలు, అసమదీయులకు ఒకరకంగా, తసమదీయులకు ఒకరకంగా జరిగిన మోసాలను మాత్రం పరకాల ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇక కొంతమంది మంత్రులు, తెలుగుదేశం నాయకులు, న్యాయవ్యవస్థలోని జడ్జీల, న్యాయవాదులు, వారి బంధువులకు జరిగిన భూపందేరాన్ని ప్రస్తావించకుండా పరకాల జాగ్రత్త వహించారు. అమరావతి పేరుతో జరిగిన భూదోపిడీ సుమారు నాలుగువేల ఎకరాలని మొన్న అవినీతి నిరోధకశాఖ వారు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారట. దాని విలువ అక్షరాలా నలభైవేలకోట్ల రూపాయలంటున్నారు. అమరావతి పేరుతో కొందరు అధికారపక్ష నాయకులు దోచుకున్నారనే శుభవార్త పరకాల స్క్రిప్టులో ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు.
చరిత్ర మొత్తం చెప్పి చెప్పి చివరకు సచివాలయ రాజధాని మాత్రం అక్కడే ఉంచితే బాగుంటుందని సన్నాయినొక్కులు నొక్కారు. రాజధాని రైతులకు ఇతర ప్రాంతాల నుంచి మద్దతు దొరకడం లేదని బాధపడ్డారు కానీ, వారికి ఎందుకు మద్దతు లభించలేదనే అంశం మీద పరకాలవారు కూసింత కృషి చేస్తే బాగుండేది.
మొత్తానికి చెప్పడానికి ఏమీ లేక, తన కథనం మీద తనకే క్లారిటీ లేక పరకాలవారు చాలా ఇబ్బంది పడ్డారని, ఆయన ప్రొఫెషనల్ రచయిత కాదని వీక్షకులకు అర్ధమయ్యేట్లు చెయ్యడంలో విజయం సాధించారు.
పరకాలవారు ఎంచుకున్న పాత్రధారులను చూస్తేనే ఆయన లక్ష్యం ఏమిటో, ఎవరికి అనుకూలమో స్పష్టంగా తెలిసిపోతుంది. అసలు గమ్మత్తు ఏమిటంటే, భ్రమరావతి నిర్మాత, విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు అంత దారుణంగా ఎందుకు ఓడిపోయారో, ఆయన కొడుకు రాజధాని ప్రాంతంలోనే మొదటి ప్రయత్నంలోనే ఎందుకు డింకీ కొట్టారో పరకాలకు అర్ధం కాకపోవడం అటుంచి…అసలు వారితో ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పించలేకపోయారు! భ్రమరావతి కోసం అహోరాత్రాలు కష్టపడిన చంద్రబాబుకు ఈ డాక్యుమెంటరీలో ఎందుకు చిన్న అతిధి పాత్ర కూడా దొరకకపోవడం అతిపెద్ద విషాదం! అన్ని నిర్మాణాలు చేసి దేవాతావస్త్రాలను సృష్టించిన చంద్రబాబు గారి పార్టీ రాజధాని ప్రాంతంలోనే ఎందుకు చిత్తుగా ఓడిపోయిందో పరకాల వారు అధ్యయనం చేయకపోవడం మరింత విషాదకరం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు