జగన్ సర్కార్ పాలన ఎంత బాగున్నా.. ప్రజలు మెచ్చినా…టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని అంత తేలిగ్గా తీసుకోవాడనికి వీల్లేదు. తిమ్మిని బమ్మి..బమ్మిని తిమ్మి చేయగల దిగ్గజం. అవకాశం కోసం ఎదురు చూడటం..మాటేసి కాటేయడం చంద్రబాబు రాజకీయాల్లో భాగం. నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం. రాజకీయంలో ఎత్తుకు పైఎత్తులు ..వ్యూహాలు..ప్రతి వ్యూహాలు వేయడంలో చంద్రబాబు ది అందవేసిన చేయి. జగన్ సర్కార్ ని ఏడాదిగా ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో? కళ్లారా చూస్తున్నదే. పేరుకే వైకాపా తప్ప…పాలనంతా టీడీపీది లా ఉందని అర్ధమవుతోంది. ఎందుకంటే జగన్ అనుకున్నది ఏది సక్రమంగా చేయలేకపోతున్నారు. జగన్ తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి చంద్రబాబు ఏదో రకంగా అడ్డు తగులుతూనే ఉన్నారు.
జగన్ చేపడుతోన్న కార్యక్రమాలకు అడ్డు తగులుతూ..హైకోర్టుతో మొట్టికాయలు వేయించడం వెనుక చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారన్నది వాస్తవం. ప్రతిగా ఇటీవల జగన్ సర్కార్ టీడీపీ నేతలకు ఇస్తోన్న షాక్ లు చూస్తూంటే ! చంద్రబాబు ఏ స్థాయిలో అధికార పక్షాన్ని ఏడాదిగా ఇబ్బంది పెట్టారన్నది తేటతెల్ల్లమవుతోంది. టీడీపీ నేతల అరెస్ట్ లు అన్ని జగన్ కక్ష సాధింపుగానే చేయిస్తున్నారని నేతల ఆరోపణలు మిన్నంటుతోన్న తీరు అద్దం పడుతోంది. అసెంబ్లీలో చంద్రబాబుకున్న బలం సరిపోదు కాబట్టి ప్లాన్ `బీ`ని అమలు చేసి అధికార పక్షాన్ని దించే ప్రయత్నాలు చేస్తున్నారని పచ్చ మీడియా ఇప్పటికే బహిర్గతం చేసింది.
ఆ కాన్ఫిడెన్స్ తోనే హిందు పురం ఎమ్యెల్యే బాలకృష్ణ ప్రభుత్వం పడిపోతుందని కామెంట్ చేసారని ఇటీవల మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా చంద్రబాబు వరుసగా ప్రభుత్వ పనితీరును ఉద్దేశిస్తూ లేఖలు రాయడం రాజకీయంగా అంతటా చర్చకు దారి తీస్తోంది. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ బాధితులకు స్వయంగా చంద్రబాబు ఓ లేఖ రాసారు. జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లే పరామర్శించడానికి రాలేకపోయానని సానుభతి చూపించడం లేఖలో హైలైట్ చేసారు. ఆ లేఖలు నేరుగా బాధిత కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నేతల్ని ఆదేశించారు.
ఇక ఈనెల 16, 17 తేదీల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేరుగా గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ ని కలిసి జగన్ ఏడాది పాలన గురించి వివరించే కార్యక్రమం పెట్టారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా పెద్ద లేఖలే సిద్దం చేసారు. తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితలుపై దాడులు-దౌర్జాన్యాలు ,టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు, అరెస్ట్ ల గురించి లేఖలో రాసి డీజీపీకి అందించారు. అలాగే పోలీసు, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. మరి ఇలా వరుసగా చంద్రబాబు పనిగట్టుకుని లేఖలు రాస్తున్నారంటే? వెనుక వ్యూహం లేకుండా? ఊరకనే చేయరని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.