.2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ భావిస్తుండగా టీడీపీ 2024లో అధికారంలోకి రాకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ అమలు చేస్తున్న పథకాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన పాలనపై జగన్ సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లో శత్రువులుగా ఉన్న జగన్, చంద్రబాబు రియల్ లైఫ్ లో కూడా అదే విధంగా ఉండటం గమనార్హం.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించగా జగన్, చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీళ్లిద్దరూ మాట వరుసకైనా మాట్లాడుకుంటారని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. చంద్రబాబుతో మాట్లాడటానికి జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. జగన్ తో తాను వెళ్లి మాట్లాడితే తన గౌరవం తగ్గుతుందని చంద్రబాబు భావించారని తెలుస్తోంది.
ఈ విషయంలో జగన్, చంద్రబాబు ఇద్దరూ ఇద్దరేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, వైఎస్సార్ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ వాళ్లిద్దరూ ఇలాంటి కార్యక్రమాలకు హాజరైన సమయంలో నవ్వుతూ మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్ మాత్రం చంద్రబాబుతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపలేదు. ఈ తరహా రాజకీయ నేతలను ఎక్కడా చూడలేదని నెటిజన్లు భావిస్తున్నారు.
గతంలో చంద్రబాబు తనకు ప్రాధాన్యతనివ్వలేదని జగన్ భావిస్తున్నారని అందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ చంద్రబాబును పలకరించినా చంద్రబాబు జగన్ ను పలకరించినా ఎవరికీ ఎలాంటి నష్టం రాదు. అయితే అహం భావానికి పోయి ఈ ఇద్దరు నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లే వీళ్లిద్దరూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే భావన చాలామందిలో ఉంది.