ఒకే రోజు రెండు తీర్పులు.. రెండు తీర్పుల్లోనూ కీలకమైన అంశం ‘గవర్నర్’.! ఒకటి మహారాష్ట్ర, ఇంకోటి ఢిల్లీ.! రెండు చోట్లా రాజకీయాలు చేసింది, చేస్తున్నదీ బీజేపీనే. రెండు చోట్లా గవర్నర్‌ని అడ్డం పెట్టుకునే బీజేపీ హేయమైన రాజకీయాలు చేసింది.
మహారాష్ట్రలో శివసేన సర్కారు కూలిపోవడానికి గవర్నర్ వ్యవస్థే కారణమయ్యింది. ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తీవ్ర ఆక్షేపణ కూడా వ్యక్తం చేసింది. గవర్నర్ తప్పు చేశారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికీ చెంప పెట్టు.
ఇక, ఢిల్లీ విషయానికొస్తే లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని అడ్డం పెట్టుకుని, అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తున్న వైనం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై మరో కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు వుంటాయనీ, కేంద్రం తాలూకు పెత్తనం తగదనీ, లెఫ్టినెంట్ గవర్నర్ అత్యుత్సాహం సమర్థనీయం కాదనీ పేర్కొంది.
మహారాష్ట్ర, ఢిల్లీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థలకీ.. అక్కడి ప్రభుత్వాలకీ మధ్య ‘గ్యాప్’ సుస్పష్టం. అసలంటూ గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలన్న డిమాండ్లు వస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.
గవర్నర్ అంటే, రాష్ట్రాలకు సంబంధించి ప్రధమ పౌరుడు లేదా పౌరురాలు. కానీ, ఆ గవర్నర్లను జనం ఛీత్కరించుకునే పరిస్థితి ఎందుకు వస్తోంది.? అంటే, ముమ్మాటికీ కేంద్రంలో అధికారంలో వున్న వాళ్ళ వల్లనే.!