కేంద్ర మంత్రి పదవిలో వున్న వెంకయ్యనాయుడిని, ఉప రాష్ట్రపతిని చేసింది బీజేపీ. ఇప్పుడు కేంద్ర మంత్రి అవ్వాల్సిన కంభంపాటి హరిబాబుని గవర్నర్ పదవిలో కూర్చోబెడుతోంది. వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబు.. ఇద్దరూ తెలుగునాట రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా పనిచేసినవారే.
బీజేపీ భావజాలం విషయంలో వెంకయ్యనాయుడు ఎలాగో, కంభంపాటి హరిబాబు కూడా అలానే. 2014 ఎన్నికల్లో లోక్ సభకు ఎంపికైన కంభంపాటి హరిబాబు, అప్పట్లో కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ అవకాశం ఆయనకు దక్కలేదు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కంభంపాటి, అప్పట్లో ప్రత్యేక హోదా సెగని బాగానే ఎదుర్కొన్నారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర క్యాబినెట్ విస్తరణ చేపట్టనున్న విషయం విదితమే. తెలంగాణ నుంచి ఒకరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి మోడీ మంత్రి వర్గంలో అవకాశం దక్కుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నిజానికి, రేసులో మొదట నిలబడాల్సిన పేరు కంభంపాటి హరిబాబుదే. అంతలా ఆయన బీజేపీకి ‘సేవ’ చేసిన మాట వాస్తవం. అయితే, కేంద్ర మంత్రి పదవికీ గవర్నర్ పదవికీ పోల్చి చూడటం సరి కాదనీ, బీజేపీకి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా, బీజేపీ అధిష్టానం ఆయన్ను గవర్నర్ పదవికి ప్రమోట్ చేసిందని కమలనాథులు అంటున్నారు.
కేంద్ర మంత్రిగా కంభంపాటి హరిబాబుకి అవకాశం ఇచ్చి వుంటే, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ఎంతో కొంత కీలక పాత్ర పోషించి వుండేవారే. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే, రాష్ట్రానికి కాస్తో కూస్తో మేలు జరిగింది. ఆ తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. ఇదిలా వుంటే, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను హరియానా గవర్నర్‌గా బదిలీ చేయడం గమనార్హం. ఆయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న విషయం విదితమే.