ఏ శిల్పం వెనకాల ఏ కథ ఉందొ…

(గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి)

చూసేది ఒక శిల్పాన్నైనా దాని వెనకాల శిల్పి భావన,ఆ కథ తెలుసుకోవడం ఒక్కోసారి కష్టమవుతుంది..ఏ శిల్పం వెనకాల ఏ కథ ఉందొ…

 

విషయం ఇది…

హనుమంతుడు చెట్టు కింద పొడవాటి జుట్టున్నవారి పక్కన నిలబడ్డాడు..

ఆ శిల్పం చూస్తూనే మీరూ అనుకున్నారు కదా..నీ మొహం మండా,అశోక వనం లో సీత అని తెలియదా అని…

 

నాకూ అదే అనిపించింది కానీ…

 

రామాయణంలోని అరణ్యకాండలో స్వయంప్రభ అనే ఆవిడ కనిపిస్తుంది…

సీతాన్వేషణకు దక్షిణ దిక్కు పోయారు..విధ్య పర్వతాలు చేరారు(జనాల విశ్వాసం ప్రకారం హంపీ నగర పరిసరప్రాంతాలు కిష్కింద అయితే..అక్కడికి వింధ్య పర్వతాలు దక్షిణదిక్కు ఎందుకయ్యాయి అని నన్నడక్కండి)…

శిల్పం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, కడప జిల్లా.

వింధ్య పర్వతాల్లో వెదకి వెదకి వేసారి పోయారు..అక్కడ ఒకచోట అడవంతా ఎండిపోయి ఉందట..కారణం ఒక ముని అడవిని శపించాడట..సరే వానరులందరూ ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు..

వాళ్లకు ఋక్షబిలం అనే గుహ కనిపిస్తుంది..వానరులంతా దానిలోకి ప్రవేశిస్తారు..అక్కడ నానారకాల వృక్షాలు,లతలు,సరస్సులు,జంతుజాలం కనిపిస్తాయి..అంతేనా..విలువైన లోహాలు,వజ్రాలు పొదగిన భవంతులూ కనిపిస్తాయి..

 

అక్కడ జింక చర్మాన్ని కప్పుకున్న ఒక తాపసి కనిపిస్తుంది..ఆవిడ గురించి విశేషాలు చెప్పమని హనుమంతుడు అడుగుతాడు…

 

మయుడు బ్రహ్మను మెప్పించి వరం పొంది,ఆ వరప్రభావంతొ శుక్రాచార్యుడి వద్ద శిల్ప శాస్త్రం నేర్చాడు..దానవశిల్పి మయుడు ఆ భవంతులు నిర్మించాడని..హేమ అనే అప్సరను మోహించాడని ఇంద్రుడు మయుడిని చంపాడని..హేమ అధీనం లో ఉన్న భవనాలకు కాపలా ఉన్నానని,తన పేరు స్వయంప్రభ అని చెబుతుంది..

 

ఇక హనుమంతుడు తాము వచ్చిన పని ఆవిదకు వివరిస్తాడు..సుగ్రీవుడు ఇచ్చిన గడువు ముగియబోతుంది..ఈ గుహ నుంచి బయటకు చేరే మార్గం చెప్పమంటాడు హనుమంతుడు..నా తపశ్శక్తితో మిమ్మల్ని బయటకు పంపుతాను,కళ్లు మూసుకొమ్మని చెప్పి అందరినీ గుహ బయటకు వెళ్ళేట్లు చేస్తుంది…

ఆ తర్వాత జటాయువు సోదరుడు సంపాతి కలవడం.సముద్రం చేరడం…..

 

ఇక హనుమంతుడు చెట్లు,పుట్టల కింద ఉన్న వారిని కలిసే మరో కథ..నిజానికి ఇది వాల్మీకి రామాయణం లో లేకపోయినా బాగా ప్రాచుర్యంలో ఉంది…

 

యుద్ధంలో మూర్చపోయిన లక్ష్మణుడి కోసం సంజీవని తేవడానికి బయలుదేరుతాడు హనుమంతుడు..ఈలోగా రావణుడు కాలనేమి అనే రాక్షసుడిని పిలిచి హనుమంతుడి పని ఆలస్యమయ్యేట్లు చెయ్యమంటాడు…కారణం తెల్లారిన తర్వాత ఆ సంజీవని పనికిరాదట…

 

ఒక ఋషి వేషంలో కాలనేమి కనిపిస్తాడు..సంజీవని చూపిస్తా అని మాయమాటలు చెప్పి,ముందుగా అక్కడి కొలనులో స్నానం చేసి రమ్మంటాడు…అక్కడ ఒక మొసలి పట్టుకుంటే దాన్ని చంపుతాడు..ఆ మొసలి ఒక శాపగ్రస్త గంధర్వకాంత..ఆవిడ కాలనేమి కపటత్వం గురించి చెబితే వాడిని సమ్హరిస్తాడు హనుమంతుడు…

 

ఇప్పుడు చెప్పండి..ఈ శిల్పంలో ఉన్నది సీతా?స్వయంప్రభా? కాలనేమా?