ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వర్సెస్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నట్లు తయారైంది. రాజకీయ పార్టీల మధ్య ‘ఎన్నికల వార్’ కాస్తా, ఇప్పుడు కీలక పదవుల్లో వున్న ఇద్దరు వ్యక్తుల మధ్య నడుస్తోంది. ఒకరేమో రాజకీయ నాయకుడు.. ఇంకొకరేమో సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రజాస్వామ్యంలో అవాంఛనీయమైన పరిస్థితి ఇది. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ స్థానిక ఎన్నికల చుట్టూ ఇంకా కరోనా రాజకీయం నడుస్తోంది. ఒకరేమో ఎన్నికలు నిర్వహించాలనీ, ఇంకొకరేమో ఎన్నికలు నిర్వహించకూడదనీ. అప్పుడూ అదే వాదన, ఇప్పుడూ అదే వాదన. అప్పుడు ‘ఓకే’ అన్నవాళ్ళే, ఇప్పుడు ‘నాట్ ఓకే’ అంటున్నారు.
అప్పుడు ‘నాట్ ఓకే’ అన్నవాళ్ళే, ఇప్పుడు ‘ఓకే’ అంటున్నారు. వ్యాక్సిన్ వచ్చేస్తోంది కాబట్టి, ఆ పనుల్లో అధికారులు బిజీగా వుంటారు కాబట్టి, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు కుదిరే పని కాదని వైఎస్ జగన్ ప్రభుత్వం, హైకోర్టుకి విన్నవించిన విషయం విదితమే. మరోపక్క, వ్యాక్సిన్ రావడానికి కనీసం 3 నుంచి ఆరు నెలల సమయం పడుతుందనీ, ఈలోగా కరోనా తగ్గింది గనుక, ఎన్నికలు నిర్వహించేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెగేసి చెబుతోంది. ఇంతలోనే, కేంద్రం నుంచి కీలక ప్రకటన వచ్చింది కరోనా వ్యాక్సిన్‌పై. జనవరిలో ఏ వారంలో అయినా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని. సో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వాదనకు అనుకూలంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కి సంబంధించి కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసింది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
అంటే, భవిష్యత్తులో ఇంకో భయంకరమైన కరోనా వేవ్‌ని చూడబోతున్నాం. అసలు ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న వ్యాక్సిన్ వల్ల ఎంతవరకు ఉపయోగం.? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్‌ని అందరికీ ఇవ్వాలనుకుంటున్నారో, అది ఇకపై పనిచేసే అవకాశం వుండకపోవచ్చని వైద్య నిపుణులే అంటున్నారు. మొత్తమ్మీద, తూకంలో మొగ్గు కాస్సేపు అటు వైపు, కాస్సేపు ఇటువైపు వెళుతోంది. మధ్యలో కరోనా వైరస్, స్థానిక ఎన్నికల చుట్టూ ఓ ఆట ఆడేస్తోంది.. ఇది పొలిటికల్ ఆటకంటే దారుణంగా తయారైంది.