బీజేపీతో తెలుగుదేశం కాళ్లబేరం

Telugudesam is at loggerheads with BJP
మామూలుగా కాదు…మోదీని చంద్రబాబు గారు, ఆయన ముఠా నాయకులు అవమానించిన తీరు ఒంట్లో రక్తమాంసాలు ఉన్నవారు ఎవ్వరూ ఊపిరి పోయేంతవరకు మర్చిపోలేరు.  అపుడెపుడో టంగుటూరి ప్రకాశం పంతులు గారు స్వతంత్రసంగ్రామంలో పోరాడుతున్న సమయంలో “సైమన్ గోబ్యాక్”  అని నినదించారట.  స్వతంత్రం వచ్చిన తరువాత మళ్ళీ ఆలాంటి రోమాంచితమైన సన్నివేశాన్ని మనం ఎవ్వరమూ చూసి ఉండలేదు.  మన కోరికను తీర్చడానికా అన్నట్లు శ్రీమాన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనవంటి (వెన్ను)పోటుగాడు ఇలలోనే లేడని గుడ్డిగా నమ్ముతూ తన కృషి ఫలితంగానే దేవెగౌడ, గుజ్రాల్,  వాజపేయి, లాంటివారు ప్రధానమంత్రులు అయ్యారని, అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారనే చిత్తభ్రాంతులకు గురవుతూ తనను తాను త్రివిక్రముడిగా స్వైరకల్పనల్లో తేలిపోతూ మోదీ కూడా తనవల్లనే ప్రధానమంత్రి అయ్యారనే వందిమాగధ స్తోత్రాలను నమ్ముతుండేవాడు.  ఆ బలహీన క్షణాల్లో ప్రధానమంత్రి హోదాలో మోదీ మహాశయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటన పెట్టుకుంటే “మోదీ గోబ్యాక్” అంటూ భారీ హోర్డింగ్స్ ను రోడ్డుకు ఇరువైపులా పెట్టించాడు.  “ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నావని” నిలదీశాడు. “ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లినా తనకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని”  ఆక్రోశించాడు. మోదీ కుటుంబాన్ని సైతం తన దూషణల్లోకి తీసుకొచ్చాడు. మోదీని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నాయకులు సైతం మోదీని అంత దారుణంగా దూషించలేదు. ఎంత బాగా తిడితే అంత పెద్ద నాయకుడిని అవుతానన్న వీధిరౌడీ తరహా ప్రవర్తనతో చంద్రబాబు జాతీయస్థాయిలో తన విలువను పూర్తిగా కోల్పోయాడు.  ఇవాళ దేశంలో చంద్రబాబు పేరును తలుచుకునే పార్టీ కానీ, నాయకుడు కానీ లేకుండా పోయాడు.  
 
Telugudesam is at loggerheads with BJP
Telugudesam is at loggerheads with BJP
కేంద్రంలో అధికారపార్టీకి నాయకత్వం వహిస్తున్న అమిత్ షా తిరుపతి వెంకన్న దర్శనం కోసం వచ్చినపుడు ఆయన కాన్వాయ్ మీద రాళ్లు, కర్రలతో  తెలుగుదేశం గూండాలు దాడి చేసి ఆయన్ను భయభ్రాంతులకు గురి చేశారు.  నిన్నటిదాకా మన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తేనా ఇంత ఘోరానికి పాల్పడింది అని అమిత్ షా అంతటివాడే వణికిపోయి పారిపోవాల్సి వచ్చింది.  కేంద్ర ప్రభుత్వ సంస్థలను తన రాష్ట్రంలో నిషేధించి తానేదో మోదీ మీద కక్ష తీర్చుకుంటున్నట్లుగా వ్యవహరించారు చంద్రబాబు.
 
కాలం మారింది.  ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి.  అయిదేళ్లపాటు దుర్నిరీక్ష్యంగా వెలిగిపోయిన చంద్రబాబు చివరకు అగ్గిపుల్ల పాటి కాంతిని కూడా కోల్పోయారు.  కేంద్రంలో మోదీ తిరిగి ప్రధానమంత్రి కాగా అమిత్ షా సాక్షాత్తూ దేశ శాంతిభద్రతలను శాసించే హోమ్ మంత్రి అయ్యారు.  దౌర్భాగ్యం ఏమిటంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఇద్దరిమీదనే చంద్రబాబు విషం చిమ్మారు.  మిగిలిన మంత్రులు ఎవ్వరిని నిందించలేదు.  ఏమి లాభం?  తాను దూషించిన ఆ ఇద్దరే మహా శక్తివంతులుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.  
 
ఇక్కడ తాను విపరీతంగా ద్వేషించిన జగన్మోహన్ రెడ్డి అరివీరభయంకరుడిగా, వేయిచేతుల కార్తవీర్యార్జునుడిలా,  రెండడుగులతో  భూమ్యాకాశాలను ఆక్రమించిన త్రివిక్రముడిలా విశ్వరూపధారి అయ్యారు.  పొరుగు రాష్ట్రంలో తాను విషం కక్కిన కేసీఆర్ రెండోసారి అధికారలక్ష్మిని సొంతం చేసుకున్నారు. “దర్టీఎస్ట్ పొలిటీషియన్ అఫ్ ఇండియా ” అనే బిరుదును చంద్రబాబుకు ప్రసాదించారు. తెలంగాణాలో నోరు లేపలేని పరిస్థితి కల్పించారు. తన ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియ అరెస్ట్ అయితే కనీసం ఆమెను పరామర్శించడానికి కానీ, తెలంగాణ పోలీసులమీద నోరు పారేసుకోవడానికి కానీ ధైర్యం చేయలేకపోయారు. “నేను కాబోయే హోమ్ మంత్రిని” అని పోలీసులముందు బెదిరించారు అచ్చెన్నాయుడు.  కానీ నిన్నటిదాకా తన సహచరమంత్రి అయిన అఖిలప్రియను జైల్లో పెడితే ఆమె పేరు ఉచ్చరించడానికి కూడా సాహసించలేకపోయాడు. అసలు ఆ కేసు గురించి మాట్లాడటానికే చంద్రబాబు ముఠా భయపడింది.  
 
ఇక కొడుకును చూద్దామంటే అతను ఒత్తి  చవటగా తేలిపోయేడు.  మొదటి పోరాటంలోనే ఘోరంగా పరాభవించబడి నాయకత్వ లక్షణాలు తనలో ఏమాత్రం లేవని రుజువు చేసుకున్నాడు.  లోకేష్ లాంటి అసమర్ధుడు పుట్టినందుకు చంద్రబాబు లోలోపల మధనపడుతూనే ఉంటారు.  వాటితోనే కుమిలిపోతుంటే అమరావతి కుంభకోణాలు, భూకబ్జాలు మొదలైన అంశాల మీద ఇవాళ కాకపొతే రేపైనా జగన్మోహన్ రెడ్డి తాట తీయక మానడని చంద్రబాబుకు సందేహంగానే ఉన్నది.  అలాగే తెలంగాణాలో ఓటుకు నోటు కేసు కూడా బతికే ఉన్నది.  ఎటు చూసినా చంద్రబాబును రాజకీయంగా రక్షించే నాధుడు కనిపించడం లేదు.  అందుకే ఆయన ఏదో ఒక సాకుతో తన ఎంపీలను అమిత్ షా దగ్గరకు పంపించి తన దీనావస్థను విన్నవించుకుంటున్నాడు.  లొంగిపోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపిస్తున్నారు.  అవసరం అయితే తిరుపతి ఉపఎన్నికలో తన అభ్యర్థిని త్యాగం చెయ్యడానికి కూడా ఆయన సిద్ధమే.  
 
దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు ఎంత లొంగుబాటును ప్రదర్శిస్తున్నా అవతలివైపు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు.  మోదీ, అమిత్ షా లు గత మూడేళ్ళలో ఒక్కసారి కూడా చంద్రబాబును కలవడానికి ఇష్టపడలేదు.  వారి అనుగ్రహం లభించేంతవరకు చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు.  ఆ క్రమంలో భాగమే మొన్న అమిత్ షా ను తెలుగుదేశం ఎంపీలు దర్శించుకోవడం. లేకపోతె ఆంధ్రాలో శాంతిభద్రతలు ఎప్పుడు ఎలా ఉంటాయో స్వానుభవంతో అయినా మోదీ, అమిత్ శాలు గ్రహించి వుండకపోతారా!  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు