తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు… కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక రద్దు!

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అప్పటి ప్రత్యర్థి జలగం వెంకట్రావు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. నేడు తీర్పు వెలువరించింది.

అవును… కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. 78 ఏళ్ల వనమా ఎన్నికను చెల్లదని ప్రకటించింది. ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన బీఆరెస్స్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగానూ ప్రకటించింది. ప్రస్తుత శాసన సభలో ఆయనే అత్యంత పెద్ద వయసువారు.

2018లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున వనమా వెంకటేశ్వరరావు, టీఆరెస్స్ (ప్రస్తుతం బీఆరెస్స్) తరఫున జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అభ్యర్థులగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో వనమా విజయం సాధించారు. అయితే ఆయన గెలుపును సవాల్‌ చేస్తూ 2019లో జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ లో… ఎన్నికల అఫిడవిట్‌ లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చరాని ఆరోపించారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం జలగం వెంకట్రావు వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. వనమా ఎన్నిక చెల్లదంటూ నేడు తీర్పు వెలువరించింది.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల జరిమానాను విధించింది.

కాగా… కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆరెస్స్ లోకి వనమా వెంకటేశ్వరరావు ఉమ్మడి ఖమ్మంలోనే సీనియర్ ఎమ్మెల్యే. తొలి నుంచి కాంగ్రెస్ వాది అయిన వనమా… 2007-09 మధ్య మంత్రిగానూ పనిచేశారు. 1989, 1999, 2004, 2018లో మొత్తం నాలుగు సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు. అయితే… 2018లో నాలుగో సారి గెలిచాక బీఆరెస్స్ లోకి వెళ్లిపోయారు.