Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం: అసెంబ్లీలో సీఎం ప్రకటన

తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం శాసనసభలో ప్రకటించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇప్పటికే గుర్తించిందని గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకలను స్పష్టంగా ఎత్తిచూపాయని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కొన్ని ఏజెన్సీలు ప్రాజెక్టులో ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులని పేర్కొందని సీఎం వివరించారు. ఈ నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించగా, ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం అసెంబ్లీలో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై సుమారు 9 గంటల పాటు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత, ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్‌డీఎస్‌ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. సీఎం ప్రకటన అనంతరం, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

KS Prasad Full Fire On Pawan Kalyan Comments | Jansena Meeting | Telugu Rajyam