బలవంతపు కాపురం… బీజేపీ – జనసేన పొత్తులో కొత్త చిచ్చు!

బలవంతంగానో, తప్పకో పెళ్లైతే అయ్యింది కానీ.. ఈలోపు మరొకరితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడమే కాకుండా, ఆ ప్రేమ గురించి బహిరంగ ప్రకటన కూడా చేసేశారు. అయినప్పటికీ ఇంకా విడాకులు అవ్వలేదు కాబట్టి కాపురం చేయాలని ఒప్పుకున్నారు. అయితే ఈ బలవంతపు కాపురానికి ఆదిలోనే హంసపాదు ఎదురైందని అంటున్నారు. దీనికి కారణం రెండు నియోజకవర్గాలని పైకి అంటున్నా… ఇష్టంలేని ప్రయాణంలో భాగంగా ఏ వంకా లేక డొంకట్టుకుని వేళాడుతున్నారని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ – జనసేన కలిసే పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాను ఎన్డీయేలో ఉన్నప్పటికీ… టీడీపీతోనే ప్రయాణం అని తెగేసి చెప్పారు. ఆ సంగతి అలా ఉంటే… ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీతో పొత్తుకు రెడీ అయిపోయారు పవన్ కల్యాణ్. ఈ మేరకు అమిత్ షాతో భేటీ అయ్యి తన అంగీకరాం తెలిపారని అంటున్నారు!

అయితే తాజాగా బీజేపీ-జనసేన మధ్య పొత్తులో చిచ్చు మొదలైందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… కూకట్‌ పల్లి నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ జనసేనకు కేటాయించేది లేదని బీజేపీ నేతలు, క్యాడర్ పార్టీ ఆఫీసులో రచ్చ రచ్చ చేశారు. మరోపక్క… టీడీపీ ఎలాగూ పోటీ చేయడం లేదు కాబట్టి.. ఆ రెండూ నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉండటం వల్ల కాబట్టి తమకే కేటాయించాలని జనసేన చెప్పుకొస్తుంది.

ఇలా శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి నియోజకవర్గాల విషయంలో రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పోటీచేసేందుకు బీజేపీ నేతలు ఐదేళ్ళుగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారట. పైగా అభ్యర్థులు కూడా ఆల్ మోస్ట్ ఫిక్సయిపోయ్యారని, ప్రకటనే తరువాయని అంటున్నారట. సరిగ్గా ఇలాంటి సమయంలో బీజేపీకి జనసేనతో పొత్తు కుదిరింది.

అయితే అంతకుముందే… జనసేన ఒంటరిగా 32 నియోజకవర్గాల్లో పోటీచేయాలని ఆ స్థానాల పేర్లు మాత్రం ప్రకటించగా.. ఆ లిస్ట్ లో ఈ రెండు నియోజకవర్గాల పేర్లు కూడా ఉన్నాయి. అయితే బీజేపీతో పొత్తులో భాగంగా… ఒక ఆరుస్థానాలు మాత్రం కేటాయిస్తామని, అందులో కూకట్ పల్లి, శేరిలింగం పల్లి ఉండవని పవన్ కు బీజేపీ నేతలు స్పష్టం చేశారంట. అయితే పవన్ కూడా ఆ రెండు నియోజకవర్గాల విషయంలో వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు.

దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదని.. మనసుల్లో హిడెన్ అజెండాలు పెట్టుకుని, ఆ మనసులు కలవకపోయినా రెండు పార్టీలు కలిసి కాపురం చేయాలనుకుంటే వ్యవహారం ఇలాగే ఉంటుందని.. అమిత్ షా చెప్పినంత మాత్రన్న పవన్ వినాలని రూల్ ఏమీ లేదని.. అమిత్ షా అయితే పవన్ కేమీ గొప్ప కాదని.. పవన్ కు ఏపీలో చంద్రబాబు ఉన్నాడని ఆయన అభిమానులు చెబుతున్నారని అంటున్నారు!!