పేపర్ లీక్ రాజకీయం.! విద్యార్థులతో చెలగాటమా.?

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని ‘టెన్త్ పేపర్ లీక్’ కేసులో అరెస్ట్ చేయడం పెను సంచలనంగా మారింది. బండి సంజయ్‌కి పేపర్ లీక్‌తో సంబంధం వుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. తక్షణం బండి సంజయ్‌ని ఎంపీ పదవి నుంచి తొలగించాలనీ, ఆయన మీద అనర్హత వేటు వేయాలనీ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

చాలా చిత్రమైన రాజకీయం ఇది.! దేశంలో ఎక్కడా లేని విధంగా ‘పేపర్ లీక్’ వివాదాలు తెలంగాణలో విద్యార్థి లోకాన్ని అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. మొన్నటికి మొన్న టీఎస్‌పీఎస్‌సీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రం లీక్ అయ్యింది. ఈ కేసులో మంత్రి కేటీయార్ మీద ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై బీజేపీ – బీఆర్ఎస్ మధ్య పెద్ద రాజకీయ రచ్చే జరిగింది.. ఆ రచ్చ కొనసాగుతూనే వుంది. ఇంతలోనే, టెన్త్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారం తెరపైకొచ్చింది. ఈసారి బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీద ఆరోపణలు వచ్చాయి. కేసీయార్‌ని టీఎస్పీఎస్‌సీ కేసులో అరెస్టు చేయని పోలీసులు, బండి సంజయ్‌ని టెన్త్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో అరెస్టు చేయడం ఆశ్చర్యకరమే.

‘టీఎస్పీఎస్‌సీ వివాదంలో కేటీయార్‌కి ఏంటి సంబంధం.?’ అని బీఆర్ఎస్ ప్రశ్నించొచ్చుగాక.! బండి సంజయ్ విషయంలోనూ అంతే కదా.? ఎవరి గోల వారిదే. మధ్యలో విద్యార్థుల జీవితాలే నాశనమయిపోతున్నాయి. ప్రశ్నా పత్రాలు లీకవుతోంటే, తాము ఎంత బాగా చదివినా ఏంటి ప్రయోజనం.? అన్న ఆవేదన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.