20ఏళ్ల తర్వాత దుమ్ములేపిన టీం ఇండియా… కొహ్లీ చేసిన తప్పేంటి?

వన్డే ప్రపంచకప్‌ లో మ్యాచ్‌ మ్యాచ్‌ కూ మెరుగవుతున్న రోహిత్‌ సేన.. అజేయ రికార్డును కొనసాగిస్తూ వరుసగా అయిదో మ్యాచ్‌ లోనూ విజయం సాధించింది. న్యూజిలాండ్‌ ను 4 వికెట్ల తేడాతో ఓడించి టోర్నీలో ఆ జట్టుకు తొలి ఓటమి రుచి చూపించింది. ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ గెలిచిన ఏకైక టీం గా నిలిచింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇలా కివీస్ పై గెలవడానికి భారత్ కు 20 ఏళ్లు పట్టింది!

అవును… గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు చెక్ పెట్టింది. ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీం ఇండియా. 2003 వన్డే ప్రపంచకప్‌ లో చివరిసారిగా న్యూజిలాండ్‌ పై గెలిచిన టీమిండియా.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ తాజాగా విజయాన్నందుకుంది.

ఈ సమయలో వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌ తో జరిగిన మ్యాచ్‌ లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వడంపై ఆ జట్టు కెప్టెన్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన టాం లాథం… ఇంకొన్ని పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌ లో చివరి 10 ఓవర్లను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు తెలిపాడు. ఇదే సమయంలో… రచిన్, డారిల్ అసాధారణ బ్యాటింగ్ చేశారని అభినందించాడు.

ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇన్ని రోజులూ షమీని ఎందుకు ఆడించలేదనే పెద్ద ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. అతని ప్లేస్ లో బ్యాటింగ్ కూడా చేస్తాడనే ఒకే ఒక్క కారణంతో శార్ధూల్ ఠాకూర్ ను తీసుకోవడంపై నిన్నమొన్నటివరకూ తెగ కామెంట్లు వినిపించేవి. ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ… తనకు తానే సాటి, తనతో లేరెవరూ పోటీ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు షమీ. ఈ వరల్డ్ కప్ లో ఆడిన ఈ తొలిమ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసుకున్నాడు.

వాస్తవానికి ఈ టోర్నమెంట్ లో మొదటి నాలుగు మ్యాచ్ లలోనూ టీం ఇండియా ఫీల్డింగ్ పై ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం టీం ఇండియా చెత్త ఫీల్డింగ్ చేసిందనే చెప్పుకోవాలి!

11వ ఓవర్లో రచిన్‌ రవీంద్ర ఇచ్చిన తేలికైన క్యాచ్‌ ను జడేజా నేలపాలు చేశాడు. అప్పటికి అతడి స్కోరు 12 మాత్రమే. ఆ తర్వాత… 34వ ఓవర్లో 75 పరుగుల వద్ద కానీ అతడు ఔట్‌ కాలేదు. 30వ ఓవర్లో జడేజా బౌలింగ్‌ లో మిచెల్‌ ఇచ్చిన క్యాచ్‌ ను రాహుల్‌ అందుకోలేకపోయాడు. మూడు ఓవర్ల తర్వాత కుల్‌ దీప్‌ బౌలింగ్‌ లో మిచెల్‌ ఇచ్చిన క్యాచ్‌ ను బౌండరీ వద్ద బుమ్రా నేలపాలు చేశాడు.

ఇక న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ లో మిచెల్‌ (130), రచిన్‌ (75)లు మాత్రమే రాణించారు. దీంతో… 50 ఓవర్లలో 273 పరుగులకు కివీస్ ఆలౌట్‌ అయ్యింది. భారత్‌ ఇన్నింగ్స్‌ లో రోహిత్‌ (46), కోహ్లి (95), శ్రేయస్‌ (33), జడేజా (39*) లు తలోచేయి వేయడంతో 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ విభాగంలో షమి 5 వికెట్లు తీసుకోగా… కుల్ దీప్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఇదే క్రమంలో బూమ్రా, సిరాజ్ లు చెరొక వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంలో ఫెర్గూసన్‌ 2 వికెట్లు తీసుకోగా… బౌల్డ్, హెన్రీ, శాంటర్న్ లు తలోవికెట్ తీసుకున్నారు.

టార్గెట్ కొహ్లీ… తెరపైకి “సెల్ఫిష్” ట్రెండింగ్!:

న్యూజిలాండ్ మ్యాచ్ లో కొహ్లీ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 95 పరుగుల వద్ద సిక్స్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. బంగ్లాదేశ్ మ్యాచ్ తరహాలోనే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశించినా… అక్కడ మరొకటి జరిగింది. అయితే… కొంతమంది నెటిజన్లు మాత్రం “సెల్ఫిష్” హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. గత రెండు మ్యాచ్ లుగా సెంచరీల కోసం బాల్స్ వేస్ట్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కొహ్లీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చివరివరకూ నిలబడి గెలిపిస్తున్నది తప్ప అన్నీ కనిపిస్తున్నాయంటూ మండిపడుతున్నారు.

వాస్తవానికి న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కూడా కొహ్లీ సెంచరీ చేసి ఉంటే… వన్ డేల్లో అతధిక సెంచరీలు చేసిన సచిన్ (49) రికార్డును సమం చేసేవాడు. ప్రస్తుతం కొహ్లీ 48 సెంచరీలతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.