మొదటివిడత పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1100 పైగా స్థానాలు గెలిచింది. రెండో విడత ఎన్నికల్లో 1000 కి పైగా గెలిచింది. తమకు 38 శాతం సీట్లు వచ్చాయంటారు చంద్రబాబు. మళ్ళీ అదే నోటితో ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయి, ఎన్నికల సంఘం సరిగా పనిచెయ్యలేదంటారు. ఎక్కడో తేడా కొడుతోంది కదూ!
చంద్రబాబు గారి కోణం నుంచి మనం పరిశీలించాలి. అసలు తెలుగుదేశం పార్టీ ఇమేజ్ గత ఏడాదిలో మేరుపర్వతంలా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలకు ఏమాత్రం అందడం లేదు. అమ్మఒడి కేవలం పదునాలుగు వేలు మాత్రమే ఇవ్వడంతో మహిళలంతా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. అలాగే ఇళ్లస్థలాలు కేవలం డెబ్బై అయిదు గజాలు మాత్రమే ఇవ్వడం ఏమాత్రం సరికాదంటున్నారు పేదవారు. జగన్ మాత్రం యాభై ఎకరాల్లో అయిదు వందల కోట్లతో లోటస్ పాండ్, అయిదువేల ఎకరాల్లో వెయ్యికోట్ల రూపాయలతో బెంగుళూరు పాలస్ కట్టుకుని, తమకు మాత్రం తెలంగాణాలో చంద్రబాబు వందగజాల్లో లక్షరూపాయలతో వేసుకున్న చిన్న పూరిగుడిసె లాంటిది ఇస్తారా అని ఆగ్రహోదగ్రులు అవుతున్నారు. కాబట్టి ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి తొంభై తొమ్మిది శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకుని అలాగే ఓట్లు కూడా వేశారు. కానీ, మాయాబజార్ సినిమాలో శకుని మాయాశశిరేఖతో పాచికలు ఆడుతున్నప్పుడు మూడు కళ్ళు పడినా రెండుగానే కనిపించినట్లు పోలింగ్ బూతులోకి వెళ్లిన ఓటరు కళ్ళకు తెలుగుదేశం మద్దతుదారులకు ఇచ్చిన గుర్తులు కూడా వైసిపి మద్దతుదారులకు ఇచ్చిన గుర్తుల్లా కళ్ళకు మాయ కమ్మినట్లు కనిపించడంతో అందరూ వైసిపికి వేశారు. దానికితోడు ఎన్నికల సంఘం అసమర్ధతతో వ్యవహరించడం వలన రాత్రికి రాత్రే అధికారులు బ్యాలెట్లు దాచిన గదిలో అర్ధరాత్రి రహస్యంగా దూరి ఫలితాలు తారుమారు చేశారు. ఇదీ నలభై ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు గారి కామెడీ వెర్షన్!
అంతేకాదు.. ఎన్నికల కౌంటింగ్ ను గ్రామాల్లో కాకుండా మండలకేంద్రానికి తీసుకెళ్లి అక్కడ లెక్కపెట్టాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు. ఎన్నికలసంఘం అనేది చంద్రబాబు నౌకరా ఆయన ఆదేశాలను పాటించడానికి అని మనం అడగరాదు. ఎన్నికల ముందురోజు వరకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డను అన్నివిధాలుగా సమర్ధించి, ఆయన సొంతగ్రామంలో ఆలయానికి వెళ్తే అక్కడ ఆయనకు తన పార్టీ నాయకులతో అఖండ స్వాగత కార్యక్రమాలను జరిపించి ఆయన కరుణకోసం నానా తిప్పలు పడిన చంద్రబాబు ఇవాళ ఎన్నికల్లో ఫలితాలు తమకు పూర్తి వ్యతిరేకంగా రావడంతో నిమ్మగడ్డను నానాతిట్లూ తిడుతున్నాడు!
నిమ్మగడ్డ ఇంత అసమర్ధుడు, అవినీతిపరుడు, దుర్మార్గుడు, ద్రోహి అని తెలుగుదేశం నాయకులు లబలబలాడుతుంటే వైసిపి నాయకులు మాత్రం నిమ్మగడ్డ లాంటి సమర్ధుడు, నీతిమంతుడు, పరమసాత్వికుడు, విశ్వసనీయత కలిగిన అధికారి అని తాము ఊహించలేదని వైసిపి వారు సంతోషంతో గంతులు వేస్తున్నారు. అసలు ఈ ఎన్నికలను షెడ్యూల్ ప్రయకం 2018 లోనే జరిపివుంటే చంద్రబాబు తన అధికారమదంతో, పోలీసులను అడ్డుపెట్టుకుని ఓటర్లను భయభ్రాంతులను చేసి స్థానిక సంస్థలన్నింటిని తన పార్టీకే దఖలు చేసుకుని ఉండేవారని, వైసిపికి వంద స్థానాలు కూడా రాకుండా చేసేవారని, అప్పుడు ఎన్నికైనవారు 2023 వరకు అధికారంలో ఉంటారు కాబట్టి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వస్తే వారికి ఇబ్బందులు కలిగిస్తారనే సదుద్దేశ్యంతోనే అప్పట్లో నిమ్మగడ్డ ఎన్నికల గూర్చి మాట్లాడలేదని, ఆయన ఊహించినట్లే వైసిపి అధికారంలోకి రావడంతో గత ఏడాదే ఎన్నికలు జరపాలని నిర్ణయించారని, తామే ఆయన నిర్ణయాన్ని అపార్ధం చేసుకున్నామని ఒక వైసిపి నాయకుడు ఛలోక్తి విసిరారు!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు