రాజధాని అమరావతి విషయంలో ‘ఒకే రాజధాని’ అంటూ నడుస్తోన్న ఉద్యమానికి ఏడాది. నిజానికి, ఉద్యమం ఉధృతంగా ప్రారంభమయి, మధ్యలో చల్లారి.. ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంది. ఎంత గింజుకున్నా అమరావతి ఉద్యమం కేవలం కొన్ని గ్రామాలకే పరిమితమవుతోంది తప్ప, కనీసం జిల్లా వ్యాపిత ఉద్యమం కూడా కాలేకపోతోంది. అమరావతి ప్రాంతం వున్న గుంటూరు జిల్లాలోనే చాలామంది ఈ ఉద్యమాన్ని పట్టించుకోవడంలేదు. పొరుగునున్న విజయవాడలో మాత్రం అడపా దడపా కొంత సందడి కనిపిస్తోంది. అమరావతి రైతుల ఆవేదనలో నిజం లేదా.? అన్నది వేరే చర్చ. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తోన్న ఈ ఉద్యమం, టీడీపీకి ఆయాసం ఉన్నన్నాళ్ళూ గట్టిగా మీడియాలో నానుతోంది. ఆ తర్వాత టీడీపీ అను’కుల’ మీడియా కూడా ఈ ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.
తప్పంతా ప్రజలదేనా.?
‘అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తోంటే.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఎందుకు పట్టించుకోవడంలేదు.? ఇది సిగ్గుమాలినతనం..’ అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ టీడీపీ అను’కుల’ మీడియాలో చర్చ సందర్భంగా నోరుపారేసుకున్నారు. అతను కొంత కాలం క్రితం ఓ న్యూస్ ఛానల్‌ని సొంతంగా నడిపాడాయె. ఇలాంటోళ్ళుండబట్టే, వ్యవస్థలు మరింత దిగజారిపోతున్నాయి. రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటే జరిగిందా.? రాజధాని అమరావతిని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారా.? అన్న ప్రశ్నలకు సమాధానం సదరు జర్నలిస్ట్ ఇవ్వగలడా.?
లాభం పొందినోళ్ళే గట్టిగా ఏడుస్తున్నారు
అమరావతి విషయంలో రైతులు చేస్తోన్న ఆందోళనలో అర్థం వుంది. అదే సమయంలో, ఆ రైతుల వెనుకాల వుండి కథ నడిపిస్తున్న టీడీపీ, టీడీపీ అను’కుల’ మీడియాని మాత్రం ఎవరూ సమర్థించడంలేదు. నిజానికి, రైతుల వెనుక పార్టీలకతీతంగా ఒకటే అజెండా వుండి వుంటే.. ఇప్పుడీ సమస్య వచ్చేదే కాదు. అమరావతి ఉద్యమం దేశవ్యాపిత చర్చనీయాంశమయ్యేది. ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి, తెలుగుదేశం పార్టీకి మైలేజ్ ఇవ్వాలన్న పచ్చమీడియా పైత్యమే ఈ మొత్తం అనర్ధానికి కారణం.
లాఠీ దెబ్బలు.. రైతులు, ప్రజలకి.. కోట్లు ఎవరికి.?
జైలుకెళుతున్నారు.. లాఠీ దెబ్బలు తింటున్నారు.. నడి రోడ్డు మీద మోకాళ్ళపై నిలుచుని వేడుకుంటున్నారు.. ఇదీ రైతుల దయనీయ గాద. కానీ, అమరావతి పేరుతో కొందరు కోట్లు వెనకేసుకున్నారు. అందులో టీడీపీ అను’కుల’ మీడియా పెద్దలు కూడా వున్నారు. అందుకే, అమరావతి ఉద్యమం, అమరావతి ప్రాంతం దాటి బయటకు వెళ్ళలేకపోతోంది. రేప్పొద్దున్న బీజేపీ వెన్నుదన్నుగా నిలబడినా, మరో పార్టీ నినదించినా.. అమరావతి ఉద్యమానికి అంటుకున్న ‘పచ్చ రంగు’ తొలగితే తప్ప.. ఆ ఉద్యమం విజయతీరాలకు చేరే అవకాశం లేదు.